న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో (2017 ఏప్రిల్– డిసెంబర్) రూ.6.56 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2016లో ఇదే కాలంతో పోల్చి చూస్తే 18 శాతం వృద్ధి నమోదయ్యింది. 2017–18లో మొత్తం సంవత్సరానికి గాను బడ్జెట్లో రూ.9.8 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు వస్తాయని అంచనా వేశారు.
కాకపోతే ఈ లక్ష్యంలో ప్రస్తుత డిసెంబర్ నాటికి 67 శాతం పూర్తయింది. పలువురు వేతన జీవులతో పాటు వృత్తి నిపుణులు ఆఖరికి కార్పొరేట్లు కూడా ముందుగా అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించినా సంవత్సరం చివరిలోనే అధిక పన్నును చెల్లిస్తారు. ఈ లెక్కన బడ్జెట్లో అంచనా వేసిన మొత్తాన్ని తేలిగ్గానే సాధించగలమని ఆర్థిక శాఖ వర్గాలు అభిప్రాయపడ్డాయి. వ్యక్తులు, కంపెనీలు చెల్లించే ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్ను, సంపద పన్ను.. ఈ ప్రత్యక్ష పన్నుల కేటగిరీలోకి వస్తాయి. తాజా వివరాలను చూస్తే...
♦ డిసెంబర్ వరకూ జారీ అయిన రిఫండ్స్ మొత్తం పరిమాణం రూ.1.12 లక్షల కోట్లు.
♦ రిఫండ్స్‌కు ముందు స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు 12.6% వృద్ధితో రూ.7.68 లక్షల కోట్లు.
♦ వసూలయిన మొత్తంలో అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్ల పరిమాణం రూ.3.18 లక్షల కోట్లు. ఈ విభాగంలో వృద్ధి 12.7%. కార్పొరేట్ల అడ్వాన్స్ పన్ను లో 10.9% వృద్ధి నమోదయితే, వ్యక్తిగత ఆదాయ పన్ను విషయంలో 21.6% వృద్ధి చెందింది.
♦ కార్పొరేట్ల ఆదాయాల్లో వృద్ధి బాగుంది కనక ఈసారి కూడా గతేడాది మాదిరి ప్రత్యక్ష పన్ను వసూళ్లు అంచనాలను మించుతాయని ఆర్థిక శాఖ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
♦ 2016–17 బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యాన్ని అధిగమించింది. లక్ష్యం రూ.8.47 లక్షల కోట్లయితే, వసూళ్ల మొత్తం రూ.8.49 లక్షల కోట్లకు చేరాయి.
Comments
Please login to add a commentAdd a comment