విదేశీ ప్రయాణం.. ట్రావెల్ కార్డుతో సులభం..
చైనా తత్వవేత్త లావోఝు చెప్పినట్లు... వేలమైళ్ల ప్రయాణమైనా ప్రారంభ మయ్యేది ఒక అడుగుతోనే. ఇప్పుడు జనం కూడా కొత్త విషయాలు తెలుసుకోవటానికి చాలా దూరం ప్రయాణాలు చేస్తున్నారు. కొందరేమో కొత్త ప్రదేశాలను చూడాలని, మరికొందరేమో బిజినెస్ వ్యవహారాల కోసం... ఇలా ఎన్నో కారణాల మీద ఇపుడు విదేశీ ప్రయాణాలు చేస్తున్నారు.
టెక్నాలజీ పుణ ్యమా అని ప్రపంచం కుగ్రామంగా మారిపోయింది. బిజినెస్ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు విదేశీ ప్రయాణం సులువైంది. టెక్నాలజీ, ట్రావెల్ అప్లికేషన్స్, సమాచార లభ్యత వంటివి విదేశీ ప్రయాణాన్ని సరళతరం చేశాయి. ఇలా ప్రయాణాన్ని ఈజీ చేసిన వాటిలో ‘ట్రావెల్ కార్డు’లు ముందున్నాయి.
ట్రావెల్ కార్డులు అంటే?
ట్రావెల్ కార్డు కూడా డెబిట్ కార్డులాంటిదే. మన మొబైల్ నంబర్‌ను ప్రీ-పెయిడ్ కార్డ్స్‌తో ఎలాగైతే రీచార్జ్ చేసుకుంటామో అలాగే ట్రావెల్ కార్డును కూడా మన బ్యాంకు అకౌంట్‌లోని డబ్బుల ద్వారా వివిధ కరెన్సీలతో నింపుకోవచ్చు. బ్యాంకులు, ఇతర సంస్థలు వీటిని జారీ చేస్తూ ఉంటాయి.
ప్రయోజనాలు
డబ్బుల్ని (క్యాష్) వెంట తీసుకెళ్లడమంటే రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం.‘ట్రావెల్ కార్డు’ను తీసుకుంటే మనం డబ్బుల్ని వెంట తీసుకెళ్లాల్సిన పని ఉండదు. వీటి వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం వేగంగా, సులభంగా డబ్బుల్ని వినియోగించుకోవచ్చు. ఎక్కడైనా ఖర్చు పెట్టొచ్చు. ఖర్చు చేయకుండా మిగిలిపోయిన డబ్బుల్ని తిరిగి పొందొచ్చు. చేసే ప్రతి ఖర్చు వివరాలను ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎస్‌ఎంఎస్ అలర్ట్స్ సర్వీసుల ద్వారా తెలుసుకో వచ్చు. దీంతో ఖర్చులను నియంత్రించుకోవచ్చు.
హాలిడే ట్రిప్‌లో మీ కార్డులోని డబ్బులు అయిపోతే మీరు మళ్లీ మీ బ్యాంకు నుంచి డబ్బుల్ని కార్డులోకి బదిలీ చేసుకోవచ్చు. ట్రావెల్ కార్డులను ఏటీఎంలలో పెట్టి నగదు తీసుకోవచ్చు. ఈ కార్డులను స్టాండర్డ్ డెబిట్ ట్రాన్సాక్షన్లకు, ఆన్‌లైన్, స్టోర్ లావాదేవీలకు ఉపయోగించుకోవచ్చు. అలాగే ఇవి పర్సనల్ ఎయిర్ యాక్సిడెంట్ కవర్‌ను (మరణిస్తేనే) అందిస్తున్నాయి. ప్రయాణంలో వీసా, పాస్‌పోర్ట్ కనిపించకుండా పోతే ఇది మనకు బాసటగా నిలుస్తుంది. మీరు ట్రావెల్ కార్డుపైనే ఎక్కువగా ఆధారపడితే అప్పుడు ఎక్స్ఛేంజ్ రేట్లపై కన్నేసి ఉంచడం మరిచిపోవద్దు.
భద్రతపై భయం వద్దు..
ట్రావెల్ కార్డుల భద్రత విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. కార్డు ఎక్కడైనా పోతే, దాన్ని వెంటనే బ్లాక్ చేసుకోవచ్చు. అలాగే పోయిన కార్డులో ఉన్న డబ్బుల్ని కొత్త కార్డులోనీ బదిలీ చేసుకోవచ్చు. ప్రస్తుతం ట్రావెల్ కార్డులు చిప్, పిన్ టెక్నాలజీ వంటి అత్యాధునిక భద్రతా ఫీచర్లతో వస్తున్నాయి. దీంతో మీరు భద్రత గురించి భయపడాల్సిన పనిలేదు.