పడగొట్టిన ఈసీబీ ప్యాకేజీ..
249 పాయింట్ల నష్టంతో 25,638కు సెన్సెక్స్
82 పాయింట్ల నష్టంతో 7,782కు నిఫ్టీ
ముంబై: యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) ప్యాకేజీ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు పతనబాట పట్టాయి. వీటితో పాటే మన స్టాక్ మార్కెట్ కూడా శుక్రవారం నష్టపోయింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 7,800 పాయింట్ల దిగువకు పడిపోయింది. స్టాక్ సూచీలు నష్టపోవడం ఇది వరుసగా మూడో రోజు. బీఎస్‌ఈ సెన్సెక్స్249 పాయింట్లు నష్టపోయి 25,638 పాయింట్లు వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 82 పాయింట్లు నష్టపోయి 7,782 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌కు ఇది రెండు వారాల కనిష్ట స్థాయి. రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ, వాహన, బ్యాంకింగ్, ఐటీ, ఆర్థిక సేవల రంగ షేర్లలో అమ్మకాలు జరిగాయి. గత మూడు రోజుల్లో సెన్సెక్స్ 531పాయింట్లు నష్టపోయింది. రూపాయి పడిపోవడం, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగుతుండడం ప్రతికూల ప్రభావం చూపించాయి. ఇక ఈ వారానికి సెన్సెక్స్ 490 పాయింట్లు(1.87 శాతం), నిఫ్టీ 161 పాయింట్లు (2 శాతం) చొప్పున నష్టపోయాయి.
4 సెన్సెక్స్ షేర్లకే లాభాలు
సన్ ఫార్మా రూపొందించిన క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే గ్లీవెక్ జనరిక్ వెర్షన్‌కు అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదం లభించడంతో సన్ ఫార్మా షేర్ 4 శాతం ఎగసింది. సెన్సెక్స్ సూచీలోని సన్ ఫార్మాతో పాటు భారతీ ఎయిర్‌టెల్, కోల్ ఇండియా, టాటా స్టీల్ షేర్లు పెరిగాయి. హెచ్‌డీఎఫ్‌సీ, మహీంద్రా అండ్ మహీంద్రా చెరో 2.4 శాతం చొప్పున నష్టపోయాయి. 30 సెన్సెక్స్ షేర్లలో 26 షేర్లు నష్టపోయాయి. 4 షేర్లు మాత్రమే లాభపడ్డాయి. విలీన వార్తలతో జీ లెర్న్ 3.3 శాతం,, ట్రీ హౌస్ ఎడ్యుకుషన్ అండ్ యాక్సెసరీ 10 శాతం చొప్పున లాభపడ్డాయి. ఎన్‌టీపీసీ, ఐటీసీ, ఐసీసీఐ బ్యాంక్, టాటా మోటార్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు పతనమయ్యాయి. హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎన్‌టీపీసీల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఈ షేర్లన్నీ 2 శాతం వరకూ నష్టపోయాయి. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, ఎస్‌బీఐలు 0.5-3 శాతం వరకూ నష్టపోయాయి. 1,567 షేర్లు నష్టాల్లో, 1,177 షేర్లు లాభాల్లో ముగిశాయి.
మదర్సన్ సుమికి అండర్ వెయిట్...
అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ, వాహన విడిభాగాల కంపెనీ మదర్సన్ సుమి రేటింగ్‌ను అండర్ వెయిట్‌కు తగ్గించింది. కంపెనీ ఆదాయం 20 శాతం తగ్గే అవకాశాలున్నాయని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేస్తోంది. మదర్సన్ సుమి అంచనా వేస్తున్న మార్జిన్లు ఆచరణ సాధ్యం కావంటూ మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. రూ,238 టార్గెట్ ధరగా ఈ కంపెనీ రేటింగ్‌ను అండర్‌వెయిట్‌కు తగ్గించింది. ఈ నేపథ్యంలో మదర్సన్ సుమి షేర్ ధర 1% క్షీణించి రూ.280 వద్ద ముగిసింది. వచ్చే ఏడాది మదర్సన్ సుమి 18 ప్లాంట్లను అందుబాటులోకి తెస్తోందని, దీంతో వ్యయాలు పెరిగిపోతాయని పేర్కొంది. కర్బన ఉద్గారాల విషయంలో ఇటీవల భారీ మోసానికి పాల్పడిన ఫోక్స్‌వ్యాగన్ నుంచి మదర్సన్ సుమికి వచ్చే రాబడుల వాటా 44%గా ఉండడమూ ప్రతికూలత చూపనున్నదని పేర్కొంది.