డిపాజిట్ రేటు తగ్గించిన ఈసీబీ
ఫ్రాంక్‌ఫర్ట్: యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) తన కీలక డిపాజిట్ రేటును ప్రస్తుత మైనస్ 0.20 శాతం నుంచి మైనస్ 0.30 శాతానికి తగ్గించింది. దీనితో బ్యాంకులు ఈసీబీ వద్ద ఉంచే నిధులకు ప్రస్తుతంకన్నా 10 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ చర్య వల్ల బ్యాంకులు తమ వద్ద ఉన్న అదనపు నిధులను ఈసీబీ వద్ద ఉంచకుండా... ఆర్థిక వ్యవస్థలోకి మళ్లించే అవకాశం ఉంటుంది. ఇది వ్యవస్థలో డిమాండ్, వృద్ధికి దారితీసే అంశం. ఈసీబీ బెంచ్‌మార్క్ రీఫైనాన్సింగ్ రేటు (తాను ఇచ్చే రుణంపై వసూలు చేసే వడ్డీరేటు) చరిత్రాత్మక కనిష్ట స్థాయి 0.05 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే.
డిమాండ్ లేక 19 దేశాల యూరో జోన్ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం (వార్షికంగా 0.1 శాతం) కూడా అతి స్వల్పంగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా, ప్రస్తుతం అమలు చేస్తున్న ఉద్దీపన ప్యాకేజీని మరో ఏడు నెలలపాటు పొడిగిస్తూ ఈసీబీ నిర్ణయం తీసుకుంది. అంటే నెలకు 60 బిలియన్ యూరోల బాండ్‌ల కొనుగోలు కార్యక్రమాన్ని(ముందుగా నిర్దేశించిన గడువు(2016, సెప్టెంబర్) మార్చి 2017 వరకూ పెంచింది. దీనివల్ల నిధులు మరింతగా వ్యవస్థలోకి వచ్చి వృద్ధికి తోడ్పాటును అందించే అవకాశం ఉంది.