‘యాంగ్రీబర్డ్స్’కు వాయిస్!
లాస్ ఏంజెల్స్: ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చాక గేమ్స్ పూర్తి స్వరూపమే మారిపోయింది. ఆండ్రాయిడ్ ఓఎస్ లో ఓ గేమ్ యాంగ్రీబర్డ్స్ మన అందరికీ తెలిసిందే. అయితే యాంగ్రీబర్డ్స్ త్వరలో మాట్లాడబోతున్నాయని గేమ్ తెలిసిన వాళ్లు కాస్త ఆశ్చర్యానికి లోనవుతున్నారు. అదేంటి యాంగ్రీబర్డ్స్ ఆటలో అవి మాట్లాడలేవు కదా.. కేవలం వాటి అరుపులు మాత్రమే వినిపిస్తాయి అని అనుకుంటున్నారా.. మీ సందేహం నిజమే. అయితే సోనీ పిక్చర్స్ సంస్థ త్వరలో యాంగ్రీబర్డ్స్ చిత్రాన్ని మన ముందుకు తీసుకురాబోతోంది.
ఇందుకోసం హాలీవుడ్ ప్రముఖుల గొంతులను ఈ పక్షులకు అరువు ఇవ్వనుంది సోనీ. పెద్దగా ఎరుపు రంగులో ఉండే పక్షికి టెర్రెన్స్ అని పేరు పెట్టారు. ఆస్కార్ గ్రహీత సీన్ పెన్, టెర్రెన్స్‌కు గొంతునివ్వనున్నారు. జాసన్ సుడీకిస్, జోష్ గాద్, డాన్నీ మెక్‌బ్రైడ్, మ్యూజిక్ దిగ్గజం బ్లేక్ షెల్టన్, చార్లీ ఎక్స్‌సీఎక్స్‌లు కూడా తమ వాయిస్‌ను ఆ పక్షులకు ఇవ్వనున్నారు. త్వరలోనే ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది.