పీఎఫ్ విత్ డ్రాయల్ కొత్త నిబంధనలు
30 దాకా నిలుపుదల
న్యూఢిల్లీ: పీఎఫ్ విత్‌డ్రాయల్‌పై పరిమితులు విధిస్తూ రూపొందించిన కొత్త నిబంధనలను ఏప్రిల్ 30 దాకా నిలుపుదల చేయాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) నిర్ణయించింది. రెండు నెలలకు పైగా ఉద్యోగం లేని చందాదారులు పూర్తి సెటిల్‌మెంట్ కోరుతూ ఈ నెలాఖరు దాకా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. కొత్త నిబంధనల అమల్లో ఆటంకాల కారణంగా ఇవి మే 1 నుంచి అమల్లోకి రాగలవని ఈపీఎఫ్‌వో తెలిపింది. దీంతో ఫిబ్రవరి 10న నోటిఫికేషన్ జారీ కావడానికి ముందున్న తరహాలోనే ఈ నెలాఖరు దాకా సెటిల్‌మెంట్ జరుగుతుందని పేర్కొంది.
రిటైరయ్యే ఉద్యోగులు ప్రావిడెంటు ఫండు ఉపసంహరణ కోసం క్లెయిములు దాఖలు చేసుకునేందుకు వయోపరిమితిని 54 ఏళ్ల నుంచి 58 ఏళ్లకు పెంచడంతో పాటు ఈపీఎఫ్ స్కీమ్ 1952కి ఈపీఎఫ్‌వో పలు సవరణలు చేసిన సంగతి తెలిసిందే. దీనితో పాటు క్లెయిమెంటు రెండు నెలలకు పైగా నిరుద్యోగిగా ఉంటే ప్రావిడెంట్ ఫండులో అప్పటిదాకా తన వంతుగా జమయిన అసలును, దానిపై వడ్డీని మాత్రమే విత్‌డ్రా చేసుకునేందుకు వీలుంటుంది. కంపెనీ జమ చేసే మొత్తాన్ని మెచ్యూరిటీ తర్వాతే తీసుకోవడానికి సాధ్యపడుతుంది. వివాహం, శిశు జననం తదితర కారణాలతో రాజీనామా చేసిన మహిళలకు 2 నెలల తప్పనిసరి నిరుద్యోగ నిబంధన వర్తించదు.