టీనేజర్లకోసం ఫేస్‌బుక్ కొత్త యాప్ ‘టాక్’
న్యూయార్క్: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఫేస్‌బుక్ మరో కొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. టీనేజర్లను దృష్టిలో పెట్టుకుని ‘టాక్’ అనే కొత్త యాప్‌ను పరిచయం చేయనుంది. లైంగిక వేధింపులకు, దోపిడీకి గురయ్యే యువకులను రక్షించే ఉద్దేశంతో ఫేస్‌బుక్ ఈ కొత్త మెసేజింగ్ అప్లికేషన్ను ప్రారంభించనుందని తాజాగా నివేదికలు ద్వారా తెలుస్తోంది. దీని ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లలతో కాంటాక్ట్‌లో ఉన్న వారిని పర్యవేక్షించటానికి అనుమతినిస్తుందని ఒక రిపోర్టు నివేదించింది.
ఈ టాక్ ఖాతాల సెర్చింగ్‌కు సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండదు. కేవలం టాక్ యూజర్లకు మాత్రమే. తద్వారా టీనేజర్లనే టార్గెట్‌గా ఎంచుకునే అపరచిత ఇంటర్నెట్ యూజర్లను ఇది నిరోధిస్తుందని కంపెనీ భావిస్తోందట. అంతేకాదు రక్షణాత‍్మకంగా ఉండటంతో ఎక్కువమంది తల్లిదండ్రులు దీనివైపు మొగ్గచూపుతారనేది సంస్థ ప్లాన్. వెబ్‌సైట్ సమాచారం ప్రకారం ఫేస్‌బుక్ మెయిన్ మెసెంజర్ యాప్ లో ఒక సాఫ్ట్‌వేర్ కోడ్‌ను జత చేసింది. దీని ప్రకారం తల్లిదండ్రులు తమపిల్లల కాంటాక్ట్‌పై పూర్తి నియంత్రణ ఉంటుందని చెప్పింది. ఈ టాక్ యాప్‌ద్వారా పిల్లల సంభాషణలను మీరు పూర్తిగా నియంత్రించవచ్చని తెలిపింది. అయితే ఇది కూడా 13సం.రాల అంతకుపైబడిన వయసున్న టీనేజర్లకు మాత్రమే పరమితం కానున్నట్టు సమాచారం.
దీంతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న టీనేజర్ల తల్లిదండ్రులకు ఊరటనివ్వనుంది. తమ పిల్లల ఆన్‌లైన్ స్వేచ్ఛను పర్యవేక్షించడానికి ఉపయోగ పడనుంది. అలాగే ఎవరితో మాట్లాడుతున్నారో.. అనే ఆందోళన, భయాలనుంచి దూరం చేయనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే దీనిపై ఫేస్‌బుక్ అధికారింగా స్పందించాల్సి ఉంది.