‘సాక్షి’ మొబైల్ యాప్‌కి విశేష స్పందన
⇒ డిజిటల్ టెక్నాలజీతోనే పాఠకులకు మరింత చేరువ
⇒ డిజిటల్ మీడియా సదస్సులో ‘సాక్షి’ డిజిటల్ మీడియా, ఐటీ ప్రెసిడెంట్ దివ్యారెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ : అన్ని వర్గాల పాఠకులకు వార్తలను తక్కువ సమయంలో చేరవేసేందుకు డిజిటిల్ మీడియా ఎంతో ఉపకరిస్తుందని ‘సాక్షి’ డిజిటల్ మీడియా, ఐటీ ప్రెసిడెంట్ దివ్యా బొల్లారెడ్డి అన్నారు. స్మార్ట్ ఫోన్ల వినియోగం విరివిగా పెరిగిపోతున్న ఈ సమయంలో అన్ని వర్గాల పాఠకులను, ముఖ్యంగా యువతను మరింతగా ఆకర్షించేందుకు సోషల్ మీడియాతోపాటు సరికొత్త యాప్స్ వాడాల్సిన అవసరాన్ని ఆమె గుర్తు చేశారు. ఢిల్లీలో మంగళవారం డిజిటల్ మీడియా ఇండియా-2015 సదస్సుకు దివ్యారెడ్డి హాజరయ్యారు.
బీబీసీ సహా ప్రపంచస్థాయి మీడియా సంస్థలకు చెందిన పలువురు డిజిటల్ మీడియా ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ మీడియాలో వస్తున్న మార్పులు, పాఠకుల అవసరాలకు తగ్గట్టుగా చేసుకోవాల్సిన మార్పులు సహా పలు అంశాలపై చర్చించారు. సదస్సులో భాగంగా ‘ఏ కేస్ స్టడీ ఆన్ ది డిజిటల్ కంటెంట్ స్ట్రాటజీ ఆఫ్ సాక్షి డెయిలీ’ అన్న అంశంపై దివ్యారెడ్డి సుదీర్ఘంగా ప్రసంగించారు. తెలుగు భాషలో సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ, సాక్షి డాట్‌కామ్ ద్వారా వార్తలను, వార్తా కథనాలను మరింత వేగవంతంగా చేరువచేసేందుకు తీసుకుంటున్న చర్యలు, టెక్నాలజీలో తీసుకువచ్చిన మార్పులను వివరించారు.
సాక్షి వెబ్ మీడియాలో తాజా వార్తలను అందించడంతోపాటు రోజువారీ పత్రికలో, టీవీలో వచ్చే వార్తలతోపాటు ఆ వార్తకు సంబంధించిన అదనపు సమాచారాన్ని, ఒక సంఘటనకు సంబంధించిన అదనపు ఫొటోలను, వీడియోలను వీలైనన్ని ఎక్కువ పాఠకులకు చేరువ చేసేలా తీర్చిదిద్దినట్టు చెప్పారు. వార్తల్లో నాణ్యత లోపించకుండా అంతర్గతంగా ఎలాంటి వ్యవస్థను రూపొందించుకోవాలనే అంశాలను వివరించారు. స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరగడంతో ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియాలోనూ పాఠకుడితో అనుబంధాన్ని కొనసాగించేందుకు తీసుకుంటున్న చర్యలను తెలిపారు. కొత్తగా ప్రారంభించిన సాక్షి మొబైల్ యాప్‌కి సైతం విశేష స్పందన లభిస్తోందన్నారు.
దీనిలో యూజర్ జనరేటెడ్ కంటెంట్(యూజీసీ)వినియోగంతో వీక్షకుడితో అనుబంధాన్ని కొనసాగించే అవకాశం ఉందన్నారు. దీనిలో వీక్షకులను సహ భాగస్వామ్యులను చేస్తూ వారు పంపే ఫొటోలను వెబ్‌లో పెడుతున్నామని తెలిపారు. డిజిటల్ మీడియాని వినియోగించే వారిలో యువత శాతం ఎక్కువగా ఉంటున్నందున వారిని ఆకట్టుకునేలా వార్తాంశాలను ఎంపిక చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని అభిప్రాయపడ్డారు.
టీవీలో వచ్చే వార్తను మరెప్పుడైనా నచ్చిన సమయంలో చూసేలా తక్కువ నిడి వి ఉన్న వీడియోలను మొబైల్ యాప్‌లో పెట్టడం, అందుకు సబంధించిన సమాచారాన్ని టెక్ట్స్ రూపంలో ఇవ్వడంతో వీక్షకుడికి మరింత వెసులుబాటుగా ఉంటోందన్నారు. డిజిటల్ మీడియాలో వస్తున్న మార్పులతో ఎప్పటికప్పుడు నవీనీకరించుకుంటే మరింతగా పాఠకులకు, వీక్షకులకు చేరువకావొచ్చని అన్నారు.