
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారతదేశంలో ఈ యేటి శ్రీమంతులంటూ ఫోర్బ్స్ వెలువరించిన జాబితాలో మళ్లీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీయే అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. దాదాపు రూ.3.4 లక్షల కోట్ల సంపదతో ఆయన నంబర్–1 స్థానంలో నిలిచారు. నిజానికి లిస్టెడ్ కంపెనీ అయిన రిలయన్స్... గత కొద్ది రోజుల్లోనే ఏకంగా 20 శాతం వరకూ పతనమయింది. ఫోర్బ్స్ జాబితా గనక ఇప్పుడు వెలువరించి ఉంటే ఆయన సంపద రూ.3 లక్షల కోట్లకన్నా తక్కువే ఉండేదన్నది మార్కెట్ వర్గాల మాట. ఇక 1.5 లక్షల కోట్ల సంపదతో విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ రెండవ స్థానంలో నిలిచారు. మొదటి– రెండు స్థానాల మధ్య తేడా దాదాపు సగానికన్నా అధికంగా ఉండటం గమనార్హం. భారతీయ కుబేరుల జాబితాలో 3వ స్థానంలో ఆర్సెలర్ మిట్టల్ అధినేత లక్ష్మీ నివాస్ మిట్టల్ నిలిచారు. ఈయన సంపద దాదాపు 1.3 లక్షల కోట్లు. తరువాతి స్థానాల్లో వరసగా హిందూజా సోదరులు, పల్లోంజీ మిస్త్రీ, హెచ్‌సీఎల్ గ్రూప్ అధిపతి శివ్ నాడార్, గోద్రెజ్ కుటుంబం నిలిచాయి. ఫోర్బ్స్ మొత్తంగా 100 మందితో ఈ జాబితాను వెలువరించింది.
తెలుగు వారు ముగ్గురు!!
భారతదేశంలోని టాప్–100 శ్రీమంతులతో ఫోర్బ్స్ రూపొందించిన ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి ముగ్గురికి చోటు దక్కింది. దాదాపు రూ.22,300 కోట్ల సంపదతో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అధిపతి పి.పి.రెడ్డి ఈ రెండు రాష్ట్రాల నుంచీ అగ్రస్థానంలో నిలిచారు. మొత్తంగా చూస్తే మాత్రం జాబితాలో ఈయనది 47వ స్థానం. దాదాపు రూ.20వేల కోట్లతో అరబిందో ఫార్మా అధిపతి పి.వి.రామ్‌ప్రసాద్ రెడ్డి, రూ.19,800 కోట్లతో దివీస్ ల్యాబ్స్ అధిపతి మురళి ఆ తరువాతి స్థానాల్లో నిలిచారు. మొత్తంగా చూస్తే ఫోర్బ్స్ జాబితాలో వీరు 50, 53 స్థానాల్లో నిలిచారు.
(గమనిక: ఫోర్బ్స్ ఈ జాబితాలో సంపదను డాలర్లలో లెక్కించగా... రూపాయిల్లోకి మార్చేటపుడు డాలర్ విలువను రూ.72గా పరిగణించటం జరిగింది.)
Comments
Please login to add a commentAdd a comment