న్యూఢిల్లీ: కస్టమర్ల నుంచి అంతగా డిమాండ్ లేకపోవడంతో ఫిబ్రవరిలో వాహనాల అమ్మకాలు తగ్గాయి. గతేడాది ఫిబ్రవరిలో 15,79,349 యూనిట్లు అమ్ముడవగా గత నెలలో 8.06 శాతం క్షీణించి 14,52,078 యూనిట్లకు తగ్గాయి. ఇక కార్ల అమ్మకాలు..గతేడాది ఫిబ్రవరిలో 2,34,632 యూనిట్లు అమ్ముడు కాగా ఈసారి 8.25 శాతం క్షీణించి 2,15,276 యూనిట్లకు పరిమితమయ్యాయి. మరోవైపు ద్విచక్ర వాహనాల అమ్మకాలు కూడా 7.97 శాతం క్షీణించి 12,22,883 యూనిట్స్ నుంచి 11,25,405 యూనిట్స్‌కు తగ్గాయి. ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ సమాఖ్య ఎఫ్‌ఏడీఏ బుధవారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ‘సంవత్సరాంతపు క్లియరెన్స్ సేల్, కొత్త మోడల్స్ లాంచింగ్‌తో జనవరిలో గణనీయంగా అమ్మకాలు జరిగాయి. కానీ నెల తిరిగేసరికి ఫిబ్రవరిలో మళ్లీ పడిపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో గతనెలలోనే విక్రయాలు గణనీయంగా తగ్గాయి‘ అని ఎఫ్‌ఏడీఏ ప్రెసిడెంట్ ఆశిష్ హర్షరాజ్ కాలె తెలిపారు. సమీప భవిష్యత్‌లో ఆశావహ సూచనలేమీ కనిపించకపోతుండటంతో.. గత ఆరు నెలల నుంచి దేశీయంగా ఆటోమొబైల్స్ విక్రయాలు క్షీణ బాటలోనే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. సెప్టెంబర్‌లో బీమాపరమైన వ్యయాలు భారీగా పెరిగిన దగ్గర్నుంచి ఒకదానితర్వాత మరొకటిగా అన్నీ ప్రతికూల పరిణామాలే చోటు చేసుకుంటూ ఉండటంతో వినియోగదారులు కార్ల కొనుగోలు ఆలోచనలను వాయిదా వేసుకుంటూ వస్తున్నారని ఆశిష్ చెప్పారు. మొత్తం మీద వినియోగదారుల సెంటిమెంట్ బలహీనంగా మారిందని పేర్కొన్నారు.
పేరుకుపోతున్న నిల్వలు..
దేశవ్యాప్తంగా డీలర్లందరి దగ్గర వాహనాల నిల్వలు గణనీయంగా పేరుకుపోయాయని ఆశిష్ చెప్పారు. గత రెండు నెలల్లో కొంత తగ్గినప్పటికీ.. పరిస్థితి మళ్లీ మొదటికొచ్చిందని ఆయన పేర్కొన్నారు. ‘కొందరు ద్విచక్ర వాహనాల డీలర్ల దగ్గర ఆందోళనకర స్థాయిలో, కనీవినీ ఎరుగనంతగా ఏకంగా 100 రోజులకు సరిపడే స్టాక్ పేరుకుపోయింది. ఈ అంశం గురించి మేం పదే పదే చెబుతూనే ఉన్నాం. ఇక వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు మొదలైనవి పెరగడంతో డీలర్ల నిర్వహణ వ్యయాలూ భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో మార్చి, ఏప్రిల్ నెలల్లో డీలర్లు అర్జంటుగా నిల్వలను తగ్గించుకోవడంపై దృష్టి పెడుతున్నారు‘ అని ఆశిష్ చెప్పారు.
పరిశోధన సంస్థలకూ వాహనాల బల్క్ డేటా విక్రయం
ఆటోపరిశ్రమ వృద్ధికి కొత్త విధానం
ఆటోమొబైల్ రంగానికి తోడ్పాటునిచ్చే దిశగా కేంద్రం కొత్త విధానాన్ని ఆవిష్కరించింది. దీనితో ఇకపై అర్హత కలిగిన వ్యాపార సంస్థలు, వ్యక్తులు, పరిశోధకులు వాహన రిజిస్ట్రేషన్ డేటాను బల్క్‌గా కొనుగోలు చేసేందుకు వెసులుబాటు లభించనుంది. ఇందుకోసం ఏడాదికి రూ. 3 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఇది అమల్లోకి రానుంది. ‘బల్క్ డేటా అవసరమైన వ్యాపార సంస్థలు, ఇతరత్రా వ్యక్తులు 2019–20 ఆర్థిక సంవత్సరానికి రూ. 3 కోట్లు కట్టాల్సి ఉంటుంది. పరిశోధన అవసరాల కోసం విద్యా సంస్థలు తీసుకునేట్లయితే రూ. 5 లక్షలు మాత్రం చెల్లిస్తే సరిపోతుంది. అయితే, ఆయా సంస్థలు ఈ డేటాను కచ్చితంగా అంతర్గతంగానే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది’ అని ‘బల్క్ డేటా షేరింగ్ విధానం, ప్రక్రియ’ నిబంధనల్లో పేర్కొన్నారు. డేటాను అన్ని వర్గాలకు అందుబాటులోకి తేవడంతో సర్వీసులు మెరుగుపడేందుకు ఉపయోగపడుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment