జోరుగా పసిడి, హుషారుగా కరెన్సీ
ముంబై: అంతర్జాతీయ మార్కెట్ లో డాలర్ కు డిమాండ్ తగ్గుతుండడంతో భారతీయ కరెన్సీ రూపాయి పుంజుకుంటోంది. సోమవారం నాటి మార్కెట్ లో డాలర్ 24 పైసల నష్టంతో ప్రారంభమైంది. దీంతో నష్టాలనుంచి తేరుకున్న రూపాయి మళ్ళీ 67రూ. మార్క్ దగ్గర స్థిరంగా ఉంది. 0.43 శాతం లాభంతో 67.05 దగ్గర కొనసాగుతోంది. దిగుమతిదారులు, బ్యాంకర్లు నుంచి డిమాండ్ తగ్గడంతో అమెరికన్ కరెన్సీ బలహీనంగా ట్రేడవుతోంది. దీనికి తోడు బలహీనమైన దేశీయ ఈక్విటీ మార్కెట్ ప్రభావంతో రూపాయి పుంజుకుంది. ఈ నేపథ్యంలో డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ మళ్లీ 67రూ. మార్కును తాకింది.
శుక్రవారం రోజు 5 పైసల నష్టంతో 66,76 దగ్గర ముగిసిన రూపాయి విలువ క్రమేపి బలపడి స్థిరంగా కొనసాగడం శుభసూచకమని విశ్లేషకుల అంచనా . బ్యాంకులు , దిగుమతిదారులునుంచి డిమాండ్ తగ్గడం, బలహీనమైన దేశీయ ఈక్విటీ మార్కెట్ ప్రభావంతో డాలర్ నిరంతర జోరుకు బ్రేక్ పడి, రూపాయి పుంజుకుంటోంది. మరోవైపు సోమవారం ఉదయం స్టాక్ మార్కెట్లు పతనం దిశగా మళ్లాయి. బీఎస్ఈ సెన్సెక్స్ , నిఫ్టీ భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో 332 పాయింట్ల నష్టంతో 26,229 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 8 వేల వందకు దిగువన .. నష్టాల్లో కొనసాగుతోంది. మిగిలిన అంతర్జాతీయ కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలహీనంగాఉండడం కూడా రూపాయి విలువ పెరగడానికికారణమని డీలర్లు చెప్పారు.
అటు డాలర్ బలహీనతతో పసిడి కూడా జోరుమీద ఉంది. ఫెడ్ వడ్డీ రేట్లు పెరగనున్నాయనే అంచనాలతో ఇటీవల వెలవెలబోయిన పసిడి తిరిగి బలపడుతోంది. ఒకవైపు డాలర్ క్షీణత, మరోవైపు ఫెడ్ వడ్డన ఉండదన్న అంచనాల నేపథ్యంలో పసిడి ధర తిరిగి పుంజుకుని..10 గ్రా. బంగారం ధర 30 వేల మార్క్ ను దాటగా..వెండి 41 వేల దగ్గర స్థిరంగా ఉంది.