అధిక రాబడుల కోసం ఇన్వెస్టర్లు ఈక్విటీల వైపు చూస్తుండటంతో గోల్డ్ ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) కళ తప్పుతున్నాయి. వరుసగా ఆరో ఏడాది కూడా గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ జరిగింది. 2018లో వీటి నుంచి రూ. 571 కోట్ల మేర పెట్టుబడులను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. దీంతో గోల్డ్ ఫండ్స్ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ (ఏయూఎం) 2017తో పోలిస్తే 2018లో 6 శాతం క్షీణించి రూ.
4,571 కోట్లకు తగ్గింది. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. గతేడాది ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాల్లోకి రూ. 1.27 లక్షల కోట్ల మేర ఇన్వెస్ట్‌మెంట్స్ వచ్చాయి. మొత్తం మీద మ్యూచువల్ ఫండ్ స్కీముల్లోకి రూ. 1.54 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. యాంఫీ గణాంకాల ప్రకారం 2017లో 14 పసిడి ఆధారిత ఈటీఎఫ్‌ల నుంచి రూ. 730 కోట్ల ఉపసంహరణ జరిగింది. 2016లో రూ. 942 కోట్లు, 2015లో రూ. 891 కోట్లు, 2014లో రూ. 1,651 కోట్లు, 2013లో రూ. 1,815 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మదుపుదారులు వెనక్కి తీసుకున్నారు.
పసిడికి కొంతైనా కేటాయించాలి..
‘అంతర్జాతీయంగా 2011–13 మధ్య కాలంలో 1,900 డాలర్లకు ఎగిసిన ఔన్సు (31.1 గ్రాములు) బంగారం రేటు ఆ తర్వాత నుంచి 1,050–1,350 మధ్యలోనే తిరుగుతోంది. రూపాయి బలహీనపడటంతో ఇటీవల దేశీయంగా పసిడి రేటు కాస్త పెరిగినా.. మొత్తం మీద చూస్తే గత ఐదేళ్లుగా పెట్టుబడి సాధనంగా ఇన్వెస్టర్లు బంగారం వైపు ఎక్కువగా మొగ్గు చూపడం లేదు. ఇదే సమయంలో ఈక్విటీ మార్కెట్లు భారీ రాబడులు ఇస్తుండటంతో.. గోల్డ్ ఫండ్స్, ఈటీఎఫ్‌ల నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయి. అయితే, పోర్ట్‌ఫోలియోకి హెడ్జింగ్‌గా కొంతైనా పసిడికి కేటాయించడం శ్రేయస్కరం‘ అని మార్నింగ్‌స్టార్ సంస్థ డైరెక్టర్ కౌస్తుభ్ బేలాపూర్కర్ చెప్పారు.
రియల్ ఎస్టేట్, బంగారం, పొదుపు సాధనాలపై రాబడులు ఆకర్షణీయంగా లేకపోవడం కూడా ఈక్విటీల వైపు ఇన్వెస్టర్లు మళ్లడానికి కారణంగా మారిందని నిపుణులు పేర్కొన్నారు. అయితే అనిశ్చితి పరిస్థితులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది ద్వితీయార్థం నుంచి పసిడిపై పెట్టుబడులు మళ్లీ పెరిగే అవకాశం ఉందని ఎస్సెల్ మ్యూచువల్ ఫండ్ సీఐవో విరాల్ బేరావాలా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment