మైనింగ్ సంస్కరణలకూ ఆర్డినెన్స్ రూట్..!
న్యూఢిల్లీ: బొగ్గు, బీమా రంగాల్లో సంస్కరణల కోసం ఆర్డినెన్స్‌లను జారీ చేసిన మోదీ సర్కారు... మైనింగ్ రంగంలో కూడా ఇదే రూట్‌ను ఎంచుకోనుంది. తద్వారా ముడి ఇనుము ఇతర ఖనిజాల వేలానికి మార్గం సుగమం చేయాలని భావిస్తోంది. ప్రతిపాదిత గనుల, ఖనిజాల(అభివృద్ధి-నియంత్రణ) చట్టం-1957కు సవరణలు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉండటమే దీనికి కారణం. ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మేక్ ఇన్ ఇండియా’లో మైనింగ్ రంగం కూడా ఒకటి. ఈ నేపథ్యంలో మైనింగ్ చట్టంలో సవరణలను అమల్లోకి తీసుకొచ్చే విధంగా ఆర్డినెన్స్ జారీ కోసం కేబినెట్ నోట్ సిద్ధమైందని గనుల శాఖకు చెందిన విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. త్వరలోనే కేబినెట్ ఆమోదం కోరనున్నట్లు వెల్లడించాయి.
మైనింగ్‌పై నిషేధం ఇతరత్రా పరిణామాల నేపథ్యంలో ఈ చట్టాన్ని మార్చడం కోసం గత యూపీఏ ప్రభుత్వం మైనింగ్ సవరణ బిల్లు-2011ను రూపొందించింది. అయితే, లోక్‌సభ రద్దు కావడంతో బిల్లు కూడా మురిగిపోయింది. కొత్తగా వచ్చిన మోదీ ప్రభుత్వం ప్రతిపాదించిన ముసాయిదా సవరణ బిల్లుపై అన్ని పక్షాల అభిప్రాయాల ఆధారంగా కొత్త బిల్లును మైనింగ్ శాఖ సిద్ధం చేసింది. అయితే, పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల ఆందోళనల కారణంగా చాలా బిల్లుల మాదిరిగానే దీన్ని ప్రవేశపెట్టడం కుదరలేదు. దీంతో ఆర్డినెన్స్ ద్వారా దీన్ని అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జోరందుకున్నాయి.