insurance sectors
-
బీమా రంగంలో అపార అవకాశాలు
న్యూఢిల్లీ: బీమా రంగం వృద్ధికి బలమైన అవకాశాలు ఉన్నాయని.. విలీనాలు, కొనుగోళ్ల లావాదేవీలు ఇక ముందూ కొనసాగుతాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అధిక పెట్టుబడుల అవసరం ఉన్న ఈ రంగంలో దీర్ఘకాల లక్ష్యాలతో.. ప్రత్యేక నైపుణ్యాలు, టెక్నాలజీలతో ప్రవేశించే కొత్త కంపెనీలకూ చోటు ఉంటుందని పేర్కొంటున్నాయి. ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్‌ను హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ విలీనం చేసుకోవడానికి ఇటీవలే జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) అనుమతి మంజూరు చేయడం, అంతకుముందు పరిశ్రమలో చోటు చేసుకున్న పరిణామాలతో ఈ అంచనా వేస్తున్నాయి. ఈ విధమైన లావాదేవీలకు అనుమతుల కోసం వచ్చే దరఖాస్తులను పరిష్కరించే విషయంలో సాయానికి బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) సైతం ప్రత్యేకంగా నిపుణుల కమిటీని నియమించుకునే సన్నాహాల్లో ఉంది. ఈ కమిటీతో విలువ మదింపుపై అధికారులకు శిక్షణ ఇప్పించనుంది. బలమైన అండర్ రైటింగ్ విధానాలు, బలమైన ఆర్థిక మూలాలు, అత్యుత్తమ యాజమాన్య విధానాలు కలిగిన సంస్థలు దీర్ఘకాలంలో బలంగా ఎదుగుతాయని ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ డిప్యూటీ ఎండీ ఆనంద్ పెజావర్ తెలిపారు. భారత్‌లో బీమా రంగం విస్తరణకు అపార అవకాశాలున్నందున, ఎన్ని సంస్థలు అయినా నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. వరుస విలీనాలు.. ప్రస్తుతం 24 జీవిత బీమా కంపెనీలు, 31 సాధారణ బీమా కంపెనీలు పనిచేస్తున్నాయి. ఇందులో వ్యవసాయ, ఆరోగ్య బీమా సంస్థలు కూడా కలిసే ఉన్నాయి. గతేడాది భారతీ ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్ వచ్చి ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్‌లో విలీనం కావడం గమనార్హం. అంతకుముందు 2020లో అపోలో మ్యూనిక్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీని హెచ్డీఎఫ్సీ ఎర్గో విలీనం చేసుకుంది. 2016లో ఎల్అండ్టీ జనరల్ ఇన్సూరెన్స్‌లో 49 శాతం వాటాను హెచ్డీఎఫ్సీ ఎర్గో సొంతం చేసుకుంది. ‘‘విస్తరణకు భారీ అవకాశాలున్నందున, జీవిత బీమా, జనరల్ బీమాలో టాప్–10 కంపెనీలు 90 శాతం లాభాల వాటాను కలిగి ఉంటాయి’’అని ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనలిస్ట్ అవినాష్ సింగ్ తెలిపారు. విస్తరణ మార్గాలు.. ఈ రంగంలో పనిచేసే కంపెనీలకు అదనపు నిధుల అవసరం ఉంటుందని, ఎప్పటికప్పుడు అవి నిధులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టడం ద్వారా వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. -
మైనింగ్ సంస్కరణలకూ ఆర్డినెన్స్ రూట్..!
న్యూఢిల్లీ: బొగ్గు, బీమా రంగాల్లో సంస్కరణల కోసం ఆర్డినెన్స్‌లను జారీ చేసిన మోదీ సర్కారు... మైనింగ్ రంగంలో కూడా ఇదే రూట్‌ను ఎంచుకోనుంది. తద్వారా ముడి ఇనుము ఇతర ఖనిజాల వేలానికి మార్గం సుగమం చేయాలని భావిస్తోంది. ప్రతిపాదిత గనుల, ఖనిజాల(అభివృద్ధి-నియంత్రణ) చట్టం-1957కు సవరణలు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉండటమే దీనికి కారణం. ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మేక్ ఇన్ ఇండియా’లో మైనింగ్ రంగం కూడా ఒకటి. ఈ నేపథ్యంలో మైనింగ్ చట్టంలో సవరణలను అమల్లోకి తీసుకొచ్చే విధంగా ఆర్డినెన్స్ జారీ కోసం కేబినెట్ నోట్ సిద్ధమైందని గనుల శాఖకు చెందిన విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. త్వరలోనే కేబినెట్ ఆమోదం కోరనున్నట్లు వెల్లడించాయి. మైనింగ్‌పై నిషేధం ఇతరత్రా పరిణామాల నేపథ్యంలో ఈ చట్టాన్ని మార్చడం కోసం గత యూపీఏ ప్రభుత్వం మైనింగ్ సవరణ బిల్లు-2011ను రూపొందించింది. అయితే, లోక్‌సభ రద్దు కావడంతో బిల్లు కూడా మురిగిపోయింది. కొత్తగా వచ్చిన మోదీ ప్రభుత్వం ప్రతిపాదించిన ముసాయిదా సవరణ బిల్లుపై అన్ని పక్షాల అభిప్రాయాల ఆధారంగా కొత్త బిల్లును మైనింగ్ శాఖ సిద్ధం చేసింది. అయితే, పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల ఆందోళనల కారణంగా చాలా బిల్లుల మాదిరిగానే దీన్ని ప్రవేశపెట్టడం కుదరలేదు. దీంతో ఆర్డినెన్స్ ద్వారా దీన్ని అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జోరందుకున్నాయి. -
బొగ్గు గనులు, బీమా ఆర్డినెన్స్‌లకు రాష్ట్రపతి ఆమోదం
న్యూఢిల్లీ: బొగ్గు గనులు, బీమా రంగానికి సంబంధించిన రెండు ఆర్డినెన్సులపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం సంతకాలు చేశారు. దీంతో బీమా రంగంలో మరింతగా విదేశీ పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) రాకకు వీలు కానుంది. అలాగే సుప్రీం కోర్టు గతంలో రద్దు చేసిన బొగ్గు గనులను తిరిగి కేటాయించేందుకూ సాధ్యపడనుంది. ఈ రెండు రంగాల్లో సంస్కరణలకు ఉద్దేశించిన బిల్లులు మంగళవారంతో ముగిసిన పార్లమెంటు సమావేశాల్లో ఆమోదానికి నోచుకోని నేపథ్యంలో కేంద్రం ఆర్డినెన్సుల మార్గాన్ని ఉపయోగించాలని కేంద్రం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా బీమా బిల్లుపై ఒకటి, బొగ్గు గనుల కేటాయింపులకు సంబంధించి కొత్తగా మరొకటి ఆర్డినెన్సులు జారీ చేసేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. తాజాగా వీటికే రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితి పెంచడం వల్ల ఈ రంగంలో 6-8 బిలియన్ డాలర్ల మేర ఎఫ్‌డీఐలు రాగ లవని అంచనా వేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. తమ ప్రభుత్వం సంస్కరణలకు కట్టుబడి ఉందనేందుకు తాజా ఆర్డినెన్సులు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. అలాగే, పార్లమెంటులోని ఏదో ఒక సభలో కీలకాంశాలను అడ్డుకుంటూపోతే.. సుదీర్ఘకాలం నిరీక్షిస్తూ కూర్చునే పరిస్థితి ఉండబోదని ఇటు ఇతర దేశాలకు, అటు ఇన్వెస్టర్లకూ తెలియజేసినట్లయిందన్నారు. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 26 శాతం నుంచి 49 శాతం దాకా పెంచాలన్న ప్రతిపాదన 2008 నుంచి పెండింగ్‌లో ఉంది. రాజ్యసభ కమిటీ ఆమోదముద్ర పడినప్పటికీ మతమార్పిళ్లు మొదలైన ఇతర అంశాలపై పార్లమెంటులో దుమారం రేగినందు వల్ల ఇటీవలే ముగిసిన సమావేశాల్లో కూడా బీమా బిల్లుపై చర్చ సాధ్యపడలేదు. అటు, లోక్‌సభ ఆమోదించినప్పటికీ బొగ్గు గనులు బిల్లుకు కూడా మోక్షం లభించలేదు.