
న్యూఢిల్లీ : నోట్ల రద్దు, జీఎస్‌టీ ఫలితంగా కొత్తగా 18 లక్షల మంది ఆదాయ పన్ను పరిథిలోకి వచ్చారని భారత్ ఐక్యరాజ్యసమితికి నివేదించింది. భారత్ వేగంగా సంస్కరణలను అమలు చేస్తోందని ఐరాస ఫోరంను ఉద్దేశించి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి గీతేష్ శర్మ చెప్పారు. నగదు లావాదేవీల స్థానంలో డిజిటల్ పద్ధతులను ప్రోత్సహించడంతో పాటు దేశమంతటా ఒకే పన్ను వ్యవస్థకు శ్రీకారం చుడుతూ జీఎస్‌టీని ప్రవేశపెట్టామన్నారు. ఈ సంస్కరణలతో పరోక్ష పన్ను చెల్లింపుదారుల సంఖ్య 50 శాతం మేర పెరిగిందన్నారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోందని అయితే అగ్రదేశాల రక్షణాత్మక విధానాలు, మరికొన్ని దేశాల్లో పెరుగుతున్న రుణభారం రికవరీ ప్రక్రియకు విఘాతంగా పరిణమించాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక వృద్ధికి అనువైన వాతావరణం కల్పించేలా అంతర్జాతీయ సమాజం అవసరమైన చర్యలు చేపట్టాలని, సమిష్టిగా ముందుకు కదలాలని పిలుపు ఇచ్చారు.