బ్యాంకుకెళ్తే బాదుడే..!!
⇒ నగదు లావాదేవీలపై పరిమితులు
⇒ నెలలో 4 దాటితే రూ. 150 వడ్డన
⇒ హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకుల్లో అమల్లోకి
న్యూఢిల్లీ: బ్యాంకుల్లో ఉచిత నగదు లావాదేవీల సంఖ్యను కుదిస్తూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ, యాక్సిస్ తదితర ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజాలు బుధవారం నుంచి పరిమితులను అమల్లోకి తెచ్చాయి. నెలలో నాలుగు నగదు లావాదేవీలు (డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్) దాటితే రూ. 150 వడ్డించడం మొదలుపెట్టాయి. పొదుపు, శాలరీ అకౌంట్లకు వీటిని వర్తింపచేస్తున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఒక సర్క్యులర్‌లో తెలిపింది. దీని ప్రకారం ఒక నెలలో పొదుపు ఖాతాలకు సంబంధించి హోమ్ బ్రాంచ్‌లలో నాలుగు నగదు లావాదేవీలు ఉచితంగా నిర్వహించుకోవచ్చు. అవి దాటితే ప్రతి అదనపు లావాదేవీపై రూ. 150 చెల్లించాల్సి ఉంటుంది. ఇక థర్డ్ పార్టీ నగదు లావాదేవీలకు సంబంధించి రోజుకు రూ. 25,000 పరిమితి ఉంటుంది. బేసిక్ నో–ఫ్రిల్స్ ఖాతాల్లో గరిష్టంగా నాలుగు విత్‌డ్రాయల్స్ ఉచితంగా ఉంటాయి. నగదు డిపాజిట్లకు ఫీజులేమీ వర్తించవు.
ఐసీఐసీఐ: ఐసీఐసీఐ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం.. హోమ్ బ్రాంచ్‌లో నెలలో తొలి నాలుగు లావాదేవీలు ఉచితం. అవి దాటితే ప్రతి రూ. 1,000కి రూ. 5 చొప్పున.. కనిష్టంగా రూ. 150 చార్జీలు ఉంటాయి. థర్డ్ పార్టీ లిమిట్ రోజుకు రూ. 50,000గా ఉంటుంది. నాన్–హోమ్ బ్రాంచ్‌లలో నెలలో తొలి నగదు లావాదేవీ ఉచితం. అటుపైన ప్రతి రూ. 1,000కి రూ. 5 చార్జీ. కనిష్టంగా రూ. 150 చార్జీలు వర్తిస్తాయి. అటు క్యాష్ డిపాజిట్ మెషీన్లలో కూడా తొలి నగదు డిపాజిట్ ఉచితం. ఆ తర్వాత రూ. 1,000కి రూ. 5 చొప్పున చార్జీలు ఉంటాయి.
యాక్సిస్ బ్యాంక్..: విలువపరంగా రూ. 10 లక్షల దాకా తొలి అయిదు నగదు లావాదేవీలు (డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్) ఉచితం. దాటితే ప్రతి వెయ్యి రూపాయలకు రూ. 5 లేదా రూ. 150 (ఏది ఎక్కువైతే అది) మేర చార్జీలు వర్తిస్తాయి.