న్యూఢిల్లీ: హీరో మోటొకార్ప్ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి క్వార్టర్లో రూ.967 కోట్ల నికర లాభం సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2016–17) క్యూ4లో సాధించిన నికర లాభం(రూ.718 కోట్లు)తో పోల్చితే 35 శాతం వృద్ధి సాధించామని హీరో మోటొకార్ప్ తెలిపింది. నికర ఆదాయం రూ.6,923 కోట్ల నుంచి 24 శాతం వృద్ధితో రూ.8,564 కోట్లకు పెరిగిందని హీరో మోటొకార్ప్ చైర్మన్, ఎండీ, సీఈఓ పవన్ ముంజాల్ చెప్పారు. వాహన విక్రయాలు 16.21 లక్షల నుంచి 20 లక్షలకు పెరిగాయని పేర్కొన్నారు. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.40 డివిడెండ్ ఇవ్వడానికి డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని వివరించారు. ఈ తాజా డివిడెండ్‌తో కలుపుకొని గత ఆర్థిక సంవత్సరానికి ఈ కంపెనీ మొత్తం రూ.95 డివిడెండ్‌ను ఇచ్చినట్లు అవుతుంది.
76 లక్షల వాహన విక్రయాలు...
ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.3,377 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 9% వృద్ధితో రూ.3,697 కోట్లకు పెరిగిందని పవన్ ముంజాల్ పేర్కొన్నారు. నికర అమ్మకాల ఆదాయం రూ.28,500 కోట్ల నుంచి 13 శాతం వృద్ధితో రూ.32,230 కోట్లకు ఎగిసిందని వివరించారు. ఇక వాహన విక్రయాలు 66.64 లక్షల నుంచి 14 శాతం వృద్ధితో 75.87 లక్షలకు పెరిగాయని పేర్కొన్నారు. అమ్మకాలు బాగా ఉండటంతో గత ఆర్థిక సంవత్సరంలో మరో సారి రికార్డ్ స్థాయి పనితీరు సాధించామని ముంజాల్ చెప్పారు.
త్వరలో ఎలక్ట్రిక్ స్కూటర్..
ఏథర్ ఎనర్జీ కంపెనీలో 30 శాతం వాటాను రూ.201 కోట్లకు కొనుగోలు చేశామని, త్వరలోనే ఈ కంపెనీ తయారు చేస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్, ఎస్340ను మార్కెట్లోకి తెస్తామని ముంజాల్ వివరించారు. ఈ ఏడాది 200 సీసీ బైక్‌లు–ఎక్స్ పల్స్, ఎక్స్‌ట్రీమ్ 200ఆర్‌ల అమ్మకాలు ఆరంభిస్తామని పేర్కొన్నారు.
రూ.2,500 కోట్ల పెట్టుబడులు..
మార్కెట్లో అగ్రస్థానాన్ని నిలుపుకోవడానికి ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో రూ.2,500 కోట్ల మేర పెట్టుడులు పెట్టనున్నామని పవన్ ముంజాల్ చెప్పారు. కొత్త మోడళ్ల బైక్‌లు, స్కూటర్ల కోసం, గుజరాత్ ప్లాంట్ విస్తరణ, ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్లాంట్ ఏర్పాటు కోసం ఈ నిధులు వినియోగిస్తామని కంపెనీ సీఎఫ్‌ఓ నిరంజన్ గుప్తా వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్లాంట్ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ఆర్థిక ఫలితాల నేపథ్యలో బీఎస్‌ఈలో హీరో మోటొకార్ప్ షేర్ 2 శాతం నష్టంతో రూ.3,662 వద్ద ముగిసింది.
హీరో లాభం 967 కోట్లు
Published Thu, May 3 2018 12:06 AM | Last Updated on Thu, May 3 2018 12:06 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment