అధిక వృద్ధి అందుకోగలం: జైట్లీ
న్యూఢిల్లీ: సుస్థిర, నిర్ణాయక ప్రభుత్వం ఏర్పాటయిన నేపథ్యంలో దేశం తిరిగి 8 నుంచి 9 శాతం ఆర్థిక వృద్ధి రేటు సాధించగలదన్న విశ్వాసాన్ని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ వ్యక్తం చేశారు. కొంత మెరుగైన పరిపాలనతోనే 8-9 శ్రేణి వృద్ధి రేటు సాధ్యమన్నది తన అభిప్రాయమని అన్నారు. పరిపాలన మరింత అత్యుత్తమంగా ఉంటే మనం పెట్టుకున్న వృద్ధి లక్ష్యాన్ని కూడా అధిగమించవచ్చని వివరించారు.
‘భవిష్యత్తు భారత్ ఆకాంక్షలు-అపరిమిత అవకాశాలు’ అన్న శీర్షికన ఆర్థికవేత్త రాజీవ్ కుమార్ రాసిన పుస్తకాన్ని ఆయన సోమవారం ఇక్కడ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పాలసీ పరమైన నిర్ణయాలను వేగవంతంగా తీసుకోవడానికి ప్రయత్నిస్తూ, ఈ ప్రక్రియలో ఇప్పటి వరకూ అనుసరిస్తూ వస్తున్న ధోరణికి స్వస్తి పలకనున్నట్లు జైట్లీ తెలిపారు. పన్నులకు సంబంధించిన అంశాలు, బీమా బిల్లు, రైల్వేలో ఇన్‌ఫ్రా పెట్టుబడులు వంటి అంశాల్లో సవాళ్లను ఎదుర్కొనడానికి కొత్త ప్రభుత్వం తగిన ప్రయత్నం చేస్తుందన్నారు.
బ్రిటన్ డిప్యూటీ ప్రధానితో భేటీ...
కాగా ఆర్థికమంత్రి సోమవారం బ్రిటన్ డిప్యూటీ ప్రధానమంత్రి నిక్ క్లెగ్‌తో సమావేశమయ్యారు. ఇరుదేశాలకూ పరస్పర ప్రయోజనకరమైన పలు అంశాలపై వారు చర్చలు జరిపారు. ప్రత్యేకించి వీరిరువురి మధ్య రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్(పాత ఒప్పందాలపై పన్ను విధించడం) సవరణ అంశంపై చర్చ జరిగినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై ప్రభుత్వ వైఖరిని బ్రిటన్ డిప్యూటీ ప్రధానమంత్రికి జైట్లీ వివరించినట్లు సమాచారం. అంతకుముందు క్లెగ్ ప్రధాని నరేంద్రమోడీతోనూ సమావేశమయ్యారు.