వచ్చే నెల 8 నుంచి భారత్లోకి ఐఫోన్ ఎస్ఈ
ధర రూ.39,000 నుంచి ప్రారంభం
న్యూఢిల్లీ: యాపిల్ కంపెనీ తన తాజా ఐఫోన్ మోడల్ ఐఫోన్ ఎస్‌ఈ ను వచ్చే నెల 8 నుంచి భారత్‌లో విక్రయించనున్నది. 16 జీబీ, 64 జీబీ మోడళ్లలో లభించే ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.39,000ల నుంచి బీటెల్ టెలిటెక్, రెడింగ్టన్ కంపెనీలు విక్రయించనున్నాయి. భారత్, చైనా దేశాల్లో విక్రయాలు పెంచుకోవడం లక్ష్యాలుగా యాపిల్ కంపెనీ ఈసారి తక్కువ ధరలో చిన్నదైన ఐఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. అయితే ప్రస్తుతం ఆన్‌లైన్ మార్కెట్లో లభ్యమవుతున్న కొన్ని ఐఫోన్ మోడళ్ల కంటే ఈ కొత్త ఐఫోన్ ధర భారత్‌లో అధికంగా ఉంది. ఈ కొత్త ఐఫోన్‌లో నాలుగు అంగుళాల స్క్రీన్, వేగవంతమైన ఏ9 ప్రాసెసర్, ఫింగర్ ప్రింట్ స్కానర్, 12 మెగా పిక్సెల్ ఐసైట్ కెమెరా, లైవ్ ఫొటోస్, వేగవంతమైన వెర్లైస్ వంటి ఫీచర్లున్నాయి. ఈ కొత్త ఐఫోన్‌ను 3,000 రిటైల్ అవుట్‌లెట్లలో అందిస్తామని రెడింగ్టన్, 3,500 అవుట్‌లెట్లలలో అందిస్తామని బీటెల్ టెలిటెక్‌లు తెలిపాయి. ఈ నెల 29 నుంచి ముందస్తు ఆర్డర్లు తీసుకుంటామని ఈ రెండు సంస్థలు వెల్లడించాయి.