హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రూ.12,500 కోట్ల రిటైల్ లోన్లు మంజూరు చేయాలని ఐసీఐసీఐ బ్యాంకు లక్ష్యం విధించుకుంది. 2017–18తో పోలిస్తే ఇది 30 శాతం అధికమని బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనుప్ బాగ్చి తెలిపారు. బ్యాంకు ప్రతినిధులు సుజిత్ గంగూలీ, సిద్ధార్థ మిశ్రా, కౌశిక్ దత్తా, ప్రశాంత్ సింగ్, శాంతనూ సమద్దర్‌తో కలిసి గురువారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ‘2018–19లో గృహ రుణాలు 25 శాతం వృద్ధి చెంది రూ.4,000 కోట్లు నమోదు కానున్నాయి. కంజ్యూమర్ లోన్లు 30 శాతం పెరిగి రూ.5,500 కోట్లను తాకనున్నాయి. ఈ వృద్ధిని చేరుకునేందుకు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తాం. అందుబాటు గృహ విభాగంపై ఫోకస్ చేస్తాం. కొత్త ఉత్పత్తులను ప్రవేశపెడతాం. మొత్తం రుణాల్లో రిటైల్ వాటా అత్యధికంగా 60 శాతం ఉంది’ అని తెలిపారు.
డిజిటల్ వైపు కస్టమర్లు.. : లావాదేవీల కోసం కస్టమర్లు బ్యాంకుల రాక గణనీయంగా తగ్గిందని అనుప్ తెలిపారు. డిజిటల్ లావాదేవీలకే వినియోగదార్లు మొగ్గుచూపుతున్నారని చెప్పారు. ‘నగదు తీసుకోవడానికి మాత్రమే ఏటీఎం కేంద్రాలకు వినియోగదార్లు వెళ్తున్నారు. ఇతర లావాదేవీలన్నీ ఆన్‌లైన్లో పూర్తి చేస్తున్నారు. ఐసీఐసీఐ బ్యాంకు మొత్తం లావాదేవీల్లో డిజిటల్ వాటా ఏకంగా 85 శాతం ఉంది. అయితే కస్టమర్లు ఆన్‌లైన్‌కు మళ్లుతున్నప్పటికీ బ్యాంకు శాఖల విస్తరణ కొనసాగుతుంది. శాఖల ఏర్పాటుతో వ్యాపారం వృద్ధి చెందుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం సంస్థకు 340 శాఖలు ఉన్నాయి. ఇందులో 50 శాతం ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో కొలువుదీరాయి. క్రెడిట్ ప్రాసెసింగ్ కేంద్రాలను మరిన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించాం’ అని వివరించారు.
ఈ ఏడాది రిటైల్ లోన్లు 30 శాతం వృద్ధి
Published Fri, Sep 21 2018 12:48 AM | Last Updated on Fri, Sep 21 2018 12:48 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment