కొద్ది రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, బ్రోకింగ్, రీసెర్చ్ దిగ్గజం ఐసీఐసీఐ సెక్యూరిటీస్ కౌంటర్‌కు మరోసారి డిమాండ్ కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఎన్‌ఎస్‌ఈలో తొలుత ఈ షేరు 8 శాతంపైగా దూసుకెళ్లింది. రూ. 569కు చేరింది. తద్వారా చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. తదుపరి కొంత వెనకడుగు వేసింది. ప్రస్తుతం 4 శాతం లాభంతో రూ. 548 వద్ద ట్రేడవుతోంది. గత నెల రోజుల్లో ఈ కౌటర్ 38 శాతం జంప్‌చేయడం విశేషం. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో కంపెనీ పనితీరుపై అంచనాలు పెరిగినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ నెల 22న క్యూ1(ఏప్రిల్-జూన్) ఫలితాలు వెల్లడించేందుకు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ బోర్డు సమావేశమవుతోంది. కాగా.. గతేడాది క్యూ4(జనవరి-మార్చి) ఫలితాలు ప్రకటించాక అంటే మే 7 తదుపరి రూ. 361 స్థాయి నుంచి ఈ షేరు 53 శాతం దూసుకెళ్లడం గమనార్హం!
ఫెడరల్ బ్యాంక్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ప్రయివేట్ రంగ సంస్థ ఫెడరల్ బ్యాంక్ కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ఎన్‌ఎస్‌ఈలో తొలుత ఈ షేరు రూ. 54 సమీపానికి ఎగసింది. ప్రస్తుతం 5 శాతం జంప్‌చేసి రూ. 52 వద్ద ట్రేడవుతోంది. ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో ఫెడరల్ బ్యాంక్ నికర లాభం 4 శాతం పుంజుకుని రూ. 401 కోట్లకు చేరింది. స్టాండెలోన్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం నామమాత్ర వృద్ధితో రూ. 3,444 కోట్లను అధిగమించింది. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 2.99 శాతం నుంచి 2.96 శాతానికి బలహీనపడ్డాయి. ఫలితాల నేపథ్యంలో ఫెడరల్ బ్యాంక్ షేరుకి గ్లోబల్ రీసెర్చ్ సంస్థ సిటీ రూ. 74 టార్గెట్ ధరతో బయ్ రేటింగ్‌ను ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment