హైదరాబాద్‌లో స్థలం కొన్న ఐకియా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్వీడన్‌కు చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద ఫర్నిచర్ రిటైల్ సంస్థ ఐకియా దేశంలో తొలి షోరూంను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్‌లో షోరూం ఏర్పాటుకు సంబంధించి హైటెక్ సిటీకి సమీపంలో 13 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసినట్లు ఐకియా ఒక ప్రకటనలో పేర్కొంది. వచ్చే పదేళ్లలో సుమారు రూ. 10,500 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఐకియా ముందుకొచ్చిన సంగతి తెలిసింది.
దేశవ్యాప్తంగా 25 స్టోర్లు ఏర్పాటు చేయాలన్న లక్ష్యంలో భాగంగా తొలి షోరూంను హైదరాబాద్‌లో సుమారు రూ. 500 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనుంది. ‘మేక్ మోర్ ఇన్ ఇండియా’ అనే కార్యక్రమంలో భాగంగా స్థానిక సరఫరాదారుల నుంచి ఫర్నిచర్‌ను అత్యధికంగా సేకరించనున్నట్లు ఐకియా ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జువెన్సియో మేజు తెలిపారు. ఇందులో భాగంగా తెలంగాణా ప్రాంతం నుంచి కూడా అత్యధికంగా ఫర్నిచర్‌ను సమీకరించనున్నట్లు ఆయన తెలిపారు.