ఇండియా సిమెంట్స్‌లో అనుబంధ కంపెనీల విలీనం
చెన్నై: రెండు అనుబంధ కంపెనీల విలీనానికి ఇండియా సిమెంట్స్ బోర్డు ఆమోదముద్ర వేసింది. తద్వారా త్రినేత్ర సిమెంట్, త్రిశూల్ కాంక్రీట్ ప్రొడక్ట్స్‌లను విలీనం చేసుకోనుంది. బుధవారం సమావేశమైన డెరైక్టర్ల బోర్డు ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసినట్లు ఇండియా సిమెంట్స్ పేర్కొంది. విలీన ప్రక్రియలో భాగంగా ఇండియా సిమెంట్స్‌తోపాటు, అనుబంధ కంపెనీలకున్న షేర్లను రద్దు చేస్తారు. ఈ రెండు కంపెనీలలో మిగిలిన వాటాదారులకు ఇండియా సిమెంట్స్‌కు చెందిన 9.75 లక్షల షేర్లను కేటాయిస్తారు.
ఇది 0.32% వాటాకు సమానంకాగా, విలీనం తరువాత ఇండియా సిమెంట్స్ చెల్లించిన మూలధనం(పెయిడప్ క్యాపిటల్) రూ. 307.18 కోట్ల నుంచి రూ. 308.15 కోట్లకు పెరుగుతుంది. 2013 మార్చినాటికి త్రినేత్ర, త్రిశూల్ సంయుక్తంగా రూ. 283 కోట్లమేర రుణాలను కలిగి ఉన్నాయి. త్రినేత్ర సిమెంట్ బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్ట్‌అయి ఉంది. కంపెనీలో ఇండియా సిమెంట్స్‌కు 61.22% వాటా ఉంది. రాజస్తాన్‌లో వార్షికంగా 1.5 మిలియన్ టన్నుల సిమెంట్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. సొంత అవసరాలకు వినియోగించే 20 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను సైతం ఏర్పాటు చేసుకుంది. ఇక త్రిశూల్ కాంక్రీట్ హైదరాబాద్, చెన్నై, బెంగళూరుసహా 8 తయారీ ప్లాంట్లను కలిగి ఉంది. కోరమాండల్ బ్రాండుతో 12.3 లక్షల ఘనపు మీటర్ల రెడీమిక్స్ కాంక్రీట్‌ను ఉత్పత్తి చేస్తోంది.