
ఇన్ఫోసిస్, విప్రోలలో నియామకాలకు బ్రేక్?
మళ్లీ రెసిషన్ నాటి రోజులు వస్తాయా.. అమెరికాలో అప్పట్లో వచ్చిన మాంద్యం ప్రభావం భారతీయ మార్కెట్లపైన, ఐటీ పరిశ్రమ ఉద్యోగాలపైన ఎంత తీవ్రంగా ఉందో తెలిసిందే. అలాంటిది ఇప్పుడు మళ్లీ దాదాపు అలాంటి పరిస్థితి వచ్చేలా కనిపిస్తోంది. భారత దేశ ఐటీ పరిశ్రమ చరిత్రలోనే ఇప్పటివరకు కనీ వినీ ఎరుగని రీతిలో వృద్ధి రేటు పడిపోవడంతో.. ఆ ప్రభావం సాఫ్ట్‌వేర్ రంగంలో నియామకాలపై పడుతోంది. దేశీయ ఐటీ దిగ్గజాలైన ఇన్ఫోసిస్, విప్రో లాంటి కంపెనీలు ఇక మీదట భారీస్థాయిలో ఫ్రెషర్లను నియమించుకునే పద్ధతికి కొన్నాళ్ల పాటు తాత్కాలికంగా స్వస్తి పలకాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
గత రెండు దశాబ్దాలుగా చాలావరకు ఐటీ కంపెనీలు క్యాంపస్ నియామకాల ద్వారా పెద్ద ఎత్తున ఫ్రెషర్లను నియమించుకుంటున్నాయి. ఇన్ఫోసిస్ సంస్థ ఒక్కటే ఏడాదికి సుమారు 20 వేల మంది ఫ్రెషర్లను నియమించుకుంటుంది. అలాంటి కంపెనీ కూడా ఫ్రెషర్ల నియామకాలు ఆపేస్తే.. సాఫ్ట్‌వేర్ రంగాన్ని మాత్రమే నమ్ముకున్న వాళ్లకు కొన్నాళ్ల పాటు ఇబ్బందులు తప్పవు. నియామకాలలో నాణ్యతను పెంచడానికి మార్గాలేంటో చూస్తున్నామని, ఇంతకుముందు కాలేజీల నుంచి క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఎక్కువ మందిని తీసుకుని, వాళ్లలో బాగా చేసేవాళ్లను వివిధ కేంద్రాలకు పంపేవాళ్లమని.. ఈసారి అలాంటి క్యాంపస్ ఇంటర్వ్యూలు తగ్గుతాయని ఇన్ఫోసిస్‌లో క్వాలిటీ యూనిట్, ప్రభుత్వ సంబంధాల విభాగ అధిపతి రంగడోర్ తెలిపారు. ఇక మీదట జాబ్ మార్కెట్ కాస్త ఇబ్బందిగానే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
బాగా తెలివైన, అత్యుత్తమ విద్యార్థులు ఎవరన్న విషయాన్ని తాము చూస్తామని, అలాంటి వాళ్లకు మాత్రం ఢోకా ఉండదని చెప్పారు. ఇంటర్వ్యూలలో కఠినమైన ప్రశ్నలు అడగడం, ఆ కాలేజీల నుంచి గతంలో వచ్చిన విద్యార్థుల పనితీరును బట్టి కాలేజి పనితీరు అంచనా వేయడం లాంటి ప్రక్రియలు ఉంటాయని తెలిపారు. దాన్నిబట్టి చూస్తే రాబోయే సంవత్సరాల్లో క్యాంపస్ సెలక్షన్ల ద్వారా ఉద్యోగాలు రావడం కష్టం అవ్వడమే కాదు.. ప్రారంభంలోనే భారీ జీతాలతో ఉద్యోగాలు మొదలుపెట్టడం కూడా ఇక మీదట అంత ఈజీ కాదని తేలిపోతోంది.