పసిడితో ఇప్పుడు ఇబ్బందే
అమెరికా వడ్డీరేట్ల పెంపు ఎఫెక్ట్
ముంబై/న్యూయార్క్: పసిడికి ఇప్పుడు గడ్డు స్థితేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందుకు తక్షణం అమెరికా ఫెడ్ ఫండ్ రేటు పావుశాతం పెంపు ఒక కారణంకాగా, వచ్చే మూడు సంవత్సరాలు కూడా మూడు దఫాల చొప్పున రేటు పెంపు అవకాశం ఉందన్న ప్రకటన దీర్ఘకాలంలో బంగారంపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్న అంచనాలు ఉన్నాయి. వచ్చే కొద్ది నెలల్లో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ఫిబ్రవరి స్థాయికి అంటే దాదాపు 1,050 డాలర్ల స్థాయికి పతనం కావచ్చని కొందరి అంచనా. వడ్డీరేట్ల పెంపు, డాలర్ మరింత బలపడుతుందన్న భయాలతో పెట్టుబడులు క్రమంగా పసిడిని వీడవచ్చని పలువురు భావిస్తున్నారు. అమెరికా ఎన్నికల ఫలితాల అనంతరం పసిడి ధర ఇప్పటికి దాదాపు 11 శాతం పడిపోయింది.
జూలైలో పసిడి 1,375 డాలర్ల స్థాయిని చూసింది. శుక్రవారం 1,136 డాలర్ల వద్ద ముగిసింది. వార్షికంగా చూస్తే... ఇంకా దాదాపు పసిడి ధర దాదాపు 74 డాలర్లు లాభంలో ఉంది. ఈ నెలలో ఈ లాభం కూడా కరిగిపోయి వార్షిక నష్టంలో పసిడి ధర ముగిస్తే... వరుసగా నాలుగేళ్లగా ఇటువంటి పరిస్థితి రికార్డవుతుంది. అలా జరిగితే, 1988–1992 తరువాత ఇలాంటి రికార్డు నమోదు ఇదే తొలిసారి అవుతుంది. వారం వారీగా చూస్తే...: ఇక పసిడి ధర వారం వారీగా అంతర్జాతీయ మార్కెట్‌లో చూస్తే– దాదాపు 24 డాలర్లు తగ్గి 1,137 డాలర్ల వద్ద ముగిసింది. ఇక ముంబై స్పాట్ మార్కెట్‌ను చూస్తే– 99.9, 99.5 ప్యూరిటీ ధర రూ.685 (2.43 శాతం) తగ్గి రూ. 27,500, రూ.27,350 వద్ద ముగిశాయి. వెండి కేజీ (.999 ఫైన్) ధర భారీగా రూ. 1,710 (4 శాతం) తగ్గి రూ.39,855 వద్ద ముగిసింది.