మార్కెట్ పంచాంగం
రెండు వారాల్లో 12 శాతంవరకూ పెరిగిన బ్యాంకింగ్ షేర్లలో లాభాల స్వీకరణ ఫలితంగా ప్రధాన స్టాక్ సూచీలు బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలు గతవారం కరెక్షన్‌కు లోనయ్యాయి. అయితే ప్రధాన సూచీలు 2 శాతం వరకూ క్షీణించిన శుక్రవారంనాడు పలు ప్రధాన, మిడ్‌క్యాప్ షేర్లు ఆల్‌టైమ్ రికార్డుస్థాయిలోనూ, నెలల గరిష్టస్థాయిలోనూ ముగియడం మార్కెట్ అంతర్గతంగా బలపడుతున్నడానికి సంకేతం.
ఇక ఈ వారం జరగనున్న ఆర్‌బీఐ సమీక్షలో మరోసారి రేట్లు తగ్గిస్తే మార్కెట్లో వెనువెంటనే బడ్జెట్ ర్యాలీ మొదలయ్యే అవకాశాలుంటాయి. రేట్లలో మార్పేదీ లేకపోతే బ్యాంకింగ్ షేర్లలో మరో రౌండు లాభాల స్వీకరణ జరగవచ్చు. ఫలితంగా మరో కొద్దిరోజులు మార్కెట్ దిద్దుబాటుకు లోనుకావొచ్చు. అటుపై బడ్జెట్‌పై అంచనాల్ని పెంచుకుంటూ నెమ్మదిగా ర్యాలీ బిల్డప్ అయ్యే ఛాన్స్ వుంది. ఇక సూచీల సాంకేతికాంశాలకొస్తే...
సెన్సెక్స్ సాంకేతికాంశాలు...
జనవరి 30తో ముగిసిన నాలుగురోజుల ట్రేడింగ్‌వారంలో తొలి మూడురోజులూ వరుసగా అప్‌ట్రెండ్ సాగించిన సెన్సెక్స్ చివరిరోజైన శుక్రవారం 29,844 పాయింట్ల రికార్డుస్థాయిని నమోదుచేసి, అక్కడ్నుంచి 29,070 కనిష్టానికి పడిపోయింది. వారంలో గరిష్ట, కనిష్టస్థాయిలు రెండూ అదేరోజు నమోదుకావడం విశేషం. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 96 పాయింట్ల స్వల్పనష్టంతో 29,183 వద్ద ముగిసింది. గత వారాంతంలో అమెరికా మార్కెట్లు క్షీణించిన ప్రభావంతో ఈ వారం గ్యాప్‌డౌన్‌తో మొదలైతే సెన్సెక్స్‌కు 28,890 సమీపంలో తొలి మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును కోల్పోతే 28,790 మద్దతుస్థాయి సెన్సెక్స్‌కు కీలకం.
ఇదే స్థాయి నుంచి జనవరి 21న భారీ ట్రేడింగ్ పరిమాణంతో మార్కెట్ పెరిగినందున 28,790 దిగువన ముగిస్తేనే తదుపరి క్షీణత కొనసాగవచ్చు. ఈ స్థాయి దిగువన మద్దతులు 28,325, 28,200 పాయింట్లు. వచ్చే కొద్దిరోజుల్లో 28,200 స్థాయిని భారీ ట్రేడింగ్ పరిమాణంతో కోల్పోతే ప్రస్తుత అప్‌ట్రెండ్‌కు బ్రేక్‌పడుతుందని టెక్నికల్ చార్టులు వెల్లడిస్తున్నాయి. ఈ వారం 28,790 మద్దతుస్థాయిని పరిరక్షించుకోగలిగితే 29,400 వరకూ పెరగవచ్చు. ఆపైన 29,750 స్థాయికి ర్యాలీ జరిపే చాన్స్ ఉంది. 30,000 శిఖరాన్ని అందుకోవాలంటే 29,750 స్థాయిపైన సూచీ స్థిరపడాల్సివుంటుంది.
నిఫ్టీ మద్దతు 8,690
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గత శుక్రవారం 9,000 పాయింట్ల మ్యాజిక్ ఫిగర్‌ను కేవలం 4 పాయింట్లతో మిస్సయ్యింది. అదేరోజున 8,996 రికార్డుస్థాయి నుంచి 8,775 పాయింట్ల కనిష్టస్థాయికి పతనమైంది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 27 పాయింట్లు నష్టంతో 8,809 వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీ క్షీణిస్తే 8,690 వద్ద ప్రధాన మద్దతు లభిస్తున్నది. 8,690 దిగువన మద్దతుస్థాయిలు 8,575, 8,530 పాయింట్లు. ఆర్‌బీఐ పాలసీ ప్రకటనవెలువడిన తర్వాత 8,690 మద్దతుస్థాయిని నిఫ్టీ పరిరక్షించుకోగలిగితే తిరిగి 9,000 స్థాయిని అందుకునే ప్రయత్నం చేయగలదు. ఈ వారం నిరోధస్థాయిలు 8,870, 8,960 పాయింట్లు.
- పి. సత్యప్రసాద్
28,790 దిగువన కరెక్షన్
Published Mon, Feb 2 2015 3:19 AM | Last Updated on Sat, Sep 2 2017 8:38 PM
Advertisement
Advertisement