నియామకాల కోసం ఐటీసంస్థల కొత్తపంథా
న్యూఢిల్లీ : అంతర్జాతీయ పరిస్థితులు ఐటీ సంస్థల నియామకాలకు గండికొడుతున్నాయి. ఇప్పటికే కొన్ని సంస్థలు తమ ఉద్యోగులను పీకేస్తుండగా.. మరికొన్ని సంస్థలు నియామకాలను ఆపివేస్తున్నాయి. వచ్చే ఆరు నెలల కాలంలో ఐటీ సంస్థల్లో నియమాకాలకు కష్టకాలమేనని సర్వేలు చెబుతున్నారు. బ్రెగ్జిట్, హెచ్-1బీ వీసా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వంటి అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో కంపెనీలు వెయిడ్ అండ్ వాచ్ పాలసీని అమలు చేయబోతున్నట్టు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ పాలసీని అమలు చేస్తూ.. తక్షణ డిమాండ్ల కోసం తాత్కాలిక ఉద్యోగులను నియమించుకోవాలని కంపెనీలు చూస్తున్నట్టు తెలిసింది. వచ్చే రెండు క్వార్టర్లో ఐటీ సంస్థల నియామకాలపై ఎక్స్పెరిస్ ఐటీ ఎంప్లాయిమెంట్ అవుట్ లుక్ సర్వేను ఎక్స్ పెరిస్ ఐటీ మ్యాన్ పవర్ గ్రూప్ ఇండియా మంగళవారం విడుదల చేసింది.
ఈ సర్వే ప్రకారం ఆటోమేషన్ ఆగమనం మెజార్టి ఐటీ సంస్థలపై ప్రభావం చూపనుందని మ్యాన్ పవర్ గ్రూప్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఏజీ రావు తెలిపారు. ఏప్రిల్-సెప్టెంబర్ వ్యవధిలో నియామకాల ప్లాన్స్ పై దేశీయ ఐటీ కంపెనీలు ఆందోళనలు వ్యక్తంచేస్తున్నాయని పేర్కొన్నారు. హెచ్-1బీ వీసాలపై ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, బ్రెగ్జిట్ తో వచ్చే ఆరు నెలల కాలంలో దేశీయ ఐటీ కంపెనీల నియామకాల అవుట్ లుక్ ప్రోత్సహకరంగా లేదని ఎక్స్ పెరిస్ ఐటీ మ్యాన్ పవర్ గ్రూప్ ఇండియా అధ్యక్షుడు మన్మీత్ సింగ్ తెలిపారు. గత క్వార్టర్ కంటే నియామకాలు ఉద్దేశ్యాలు ఈ క్వార్టర్లో 15 శాతం తగ్గినట్టు సర్వే పేర్కొంది. కేవలం 58 శాతం కంపెనీలు మాత్రమే వచ్చే రెండు క్వార్టర్లో నియామకాలు చేపట్టాని యోచిస్తున్నట్టు తెలిపింది. వెయిట్ అండ్ వాచ్ పాలసీని అమలు చేస్తూ.. వెనువెంటనే డిమాండ్లను సాకారంచేసేందుకు తాత్కాలిక నియామకాలు చేపట్టాలని భావిస్తున్నట్టు సింగ్ చెప్పారు.