చిక్కుల్లో లక్ష్మీ విలాస్‌ బ్యాంకు! | Lakshmi Vilas Bank In Trouble | Sakshi
Sakshi News home page

చిక్కుల్లో లక్ష్మీ విలాస్‌ బ్యాంకు!

Published Sat, Sep 28 2019 4:13 AM | Last Updated on Sat, Sep 28 2019 4:21 AM

Lakshmi Vilas Bank In Trouble - Sakshi

న్యూఢిల్లీ: మరో ప్రైవేటు బ్యాంకులో ముసలం మొదలైంది. చెన్నై కేంద్రంగా దక్షిణాదిలో ప్రధానంగా కార్యకలాపాలు నిర్వహించే లక్ష్మీ విలాస్‌ బ్యాంకు ఆరోపణల్లో చిక్కుకుంది. బ్యాంకు బోర్డు డైరెక్టర్లకు వ్యతిరేకంగా మోసం, నేరపూరిత కుట్ర, నమ్మకద్రోహం అభియోగాలతో ఢిల్లీలో ఎఫ్‌ఐఆర్‌ దాఖలైంది. ‘‘ఢిల్లీ పోలీసు విభాగంలోని ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం 2019 సెప్టెంబర్‌ 23న ఎల్‌వీబీ బోర్డు డైరెక్టర్లు, తదితరులపై మోసం, విశ్వాస ఘాతుకం, నేరపూరిత కుట్ర తదితర అభియోగాలతో కన్నాట్‌ పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసింది’’అంటూ ఎల్‌వీబీ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. చట్టపరంగా తగిన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపింది. రెలిగేర్‌ ఫిన్‌వెస్ట్‌ లిమిటెడ్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసినట్టు వివరించింది.

తాము చేసిన రూ.790 కోట్ల డిపాజిట్‌ను లక్ష్మీ విలాస్‌ బ్యాంకు దుర్వినియోగం చేసిందన్నది రెలిగేర్‌ ఫిన్‌వెస్ట్‌ ఆరోపణ. ‘‘రెలిగేర్‌ ఫిన్‌వెస్ట్‌ లిమిటెడ్‌ నిధులను చట్టవిరుద్ధంగా దుర్వినియోగం చేయడం వెనుక పెద్ద కుట్ర ఉన్నట్టు కనిపిస్తోంది. ఇందుకు ఎల్‌వీబీ కేంద్రంగా పనిచేసింది’’ అని ఫిర్యాదులో రెలిగేర్‌ ఫిన్‌వెస్ట్‌ ఆరోపించినట్టు సమాచారం. అయితే, బ్యాంకు డైరెక్టర్ల బోర్డు మొత్తంపై ఈ ఆరోపణలు చేసిందా లేక కొందరు డైరెక్టర్లపైనేనా అన్న స్పష్టత అయితే ఇంకా రాలేదు. ఇటీవలే పీఎంసీ బ్యాంకు ఒకటి సంక్షోభంలో పడిన విషయం తెలిసిందే.

ప్రముఖ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ను లక్ష్మీ విలాస్‌ బ్యాంకు విలీనం చేసుకునేందుకు ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. విలీనానికి అనుమతి కోరుతూ ఈ సంస్థలు ఆర్‌బీఐ వద్ద దరఖాస్తు కూడా దాఖలు చేశాయి. తాజా పరిణామాలు విలీనంపై ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. అయితే, రెలిగేర్‌ ఫిన్‌వెస్ట్‌ 2018 మే నెలలో మొదటిసారి ఈ అంశాన్ని లేవనెత్తిందని, విలీన చర్చలు ఆ తర్వాతే మొదలైనందున కేసు ప్రభావం విలీనంపై ఉండబోదన్న అభిప్రాయం బ్యాంకు వర్గాల నుంచి వ్యక్తమైంది. 

మార్కెట్లో షేర్‌ లోయర్‌ సర్క్యూట్‌.. 
మోసం సహా పలు ఆరోపణల ఆధారంగా లక్ష్మీ విలాస్‌ బ్యాంకు (ఎల్‌వీబీ) డైరెక్టర్లకు వ్యతిరేకంగా ఎఫ్‌ఐఆర్‌ దాఖలవడం శుక్రవారం కంపెనీ షేర్లను కిందకు పడదోసింది. అమ్మకాల సెగకు షేరు 5 శాతం లోయర్‌ సర్క్యూట్‌ను తాకింది. ఎన్‌ఎస్‌ఈలో రూ.36.50 వద్ద, బీఎస్‌ఈలో రూ.36.55 వద్ద షేరు ముగిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement