నియామకాలు
⇔ ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) ప్రెసిడెంట్‌గా తకిహికొ నకయో తిరిగి ఎన్నికయ్యారు. నవంబర్ 24 నుంచి ఐదేళ్ల పదవీ కాలంలో కొనసాగడానికి బ్యాంక్ బోర్డ్ ఆఫ్ గవర్నర్లు ఏకగ్రీవంగా ఆయనను ఎన్నుకున్నారు.
⇔ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డెరైక్ట్ ట్యాక్సెస్-సీబీడీటీ) కొత్త చైర్‌పర్సన్‌గా రాణి సింగ్ నాయర్ పదవీ బాధ్యతలు చేపట్టారు.
⇔ మైక్రోసాఫ్ట్’ ఇండియా ప్రెసిడెంట్‌గా అనంత్ మహేశ్వరి ఎంపికయ్యారు. ఈయన మైక్రోసాఫ్ట్ ఇండియా చైర్మన్ భాస్కర్ ప్రమాణిక్ నుంచి 2017 జనవరి 1 నుంచి ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు.
జీఎస్‌టీకి ఆమోదం
దేశంలో ఏకైక మార్కెట్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఏ ప్రాంతమైనా, ఏ రాష్ట్రమైనా అన్నిచోట్లా ఒక వస్తువుకు ఒకే పన్నును ప్రతిపాదిస్తున్న ‘గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్’ బిల్లును సుదీర్ఘ రాజకీయ వ్యూహాల అనంతరం బుధవారం రాత్రి రాజ్యసభ కొన్ని సవరణలతో ఆమోదించింది. దీనిపై పరిశ్రమ వర్గాలు, పన్ను నిపుణులు హర్షం వ్యక్తం చేశారు. జీడీపీపై సానుకూల ప్రభావం ఉంటుందని, ఆర్థిక రంగ వృద్ధికి తోడ్పడుతుందని, వస్తు, సేవల వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తుందని, నల్లధనానికి కళ్లెం వేస్తుందని అభిప్రాయపడ్డారు. సమర్థవంతమైన పన్నుల వ్యవస్థ అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు.
లాఇకో ‘సూపర్3’ సిరీస్ టీవీలు
చైనా ఇంటర్నెట్ అండ్ టెక్నాలజీ దిగ్గజ కంపెనీ ‘లాఇకో’ తాజాగా తన ‘సూపర్3’ సిరీస్ అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్‌టీవీలను భారత మార్కెట్‌లో ఆవిష్కరించింది. ఈ సిరీస్‌లో 55 అంగుళాల ‘ఎక్స్55’, 65 అంగుళాల ‘ఎక్స్65’, 65 అంగుళాల ‘మ్యాక్స్65’అనే ప్రొడక్టులు ఉన్నాయి. 4కే అల్ట్రా హెచ్‌డీ (3840‘2160) రెజల్యూషన్ వీటి సొంతం. ‘ఎక్స్55’ ధర రూ.59,790గా, ‘ఎక్స్65’ ధర రూ.99,790గా, ‘మ్యాక్స్65’ ధర రూ.1,49,790గా ఉంది. ఈ టీవీలు ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తాయి.
వోకార్డ్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ మరో పంచ్
అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్‌ఎఫ్‌డీఏ) తాజాగా ఫార్మా దిగ్గజం ‘వోకార్డ్’కు మరో షాకిచ్చింది. ఈ సంస్థకు చెందిన మరో ప్లాంటు ఔషధాల దిగుమతులపై నిషేధం విధించింది. వోకార్డ్ తన అంకలేశ్వర్ ప్లాంటులో తయారీ నిబంధనలు అతిక్రమించిందని, తదనుగుణంగానే అక్కడ త యారైన ఔషధాల దిగుమతిపై నిషేధం విధిస్తున్నామని యూఎస్‌ఎఫ్‌డీఏ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.
8వ ఏడాదీ ముకేశ్ అంబానీ వేతనం రూ.15 కోట్లు
భారత్ ధనవంతుల్లో మొదటి స్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ వరుసగా ఎనిమిదవ ఏడాది 2015-16 సంవత్సరంలోనూ రూ.15 కోట్ల వేతనమే తీసుకున్నారు. ఆమోదిత మొత్తం రూ.38.75 కోట్లు అయినా... రూ.15 కోట్లను ఆయన తీసుకున్నట్లు 2015-16 వార్షిక నివేదికలో ఆర్‌ఐఎల్ తెలిపింది. సంస్థ బోర్డ్‌లోని ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ల వేతనం భారీగా పెరుగుతున్నా... ముకేశ్ తన నిర్ణయానికి అనుగుణంగా నడుచుకుంటున్నారు.
టాప్-10 కార్పొరేట్ గ్రూప్‌ల రుణం 5 లక్షల కోట్లు
ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలకు ఈ ఏడాది మార్చి నాటికి టాప్ 10 కార్పొరేట్ గ్రూపులు చెల్లించాల్సిన రుణ మొత్తం రూ.5.73 లక్షల కోట్లు. ఆర్థికశాఖ సహాయమంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ రాజ్యసభలో ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో ఈ విషయాన్ని తెలిపారు.
సుబ్రతారాయ్ పెరోల్ పొడిగింపు
సహారా చీఫ్ సుబ్రతారాయ్ పెరోల్‌ను సెప్టెంబర్ 16 వరకూ సుప్రీంకోర్టు పొడిగించింది. అయితే తదుపరి వాయిదాలోపు రూ.300 కోట్లను మార్కెట్ రెగ్యులేటర్ సెబీ వద్ద డిపాజిట్ చేయాలని, లేదంటే తిరిగి జైలుకు పంపవలసి వస్తుందని స్పష్టం చేసింది. రెండు గ్రూప్ సంస్థలు మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా మదుపరుల నుంచి సేకరించిన డబ్బు దాదాపు రూ.25,000 కోట్లను తిరిగి చెల్లించడంలో విఫలమయిన కేసులో దాదాపు రెండేళ్లు తీహార్ జైలులో ఉన్న రాయ్, ఇటీవలే తల్లి మరణంతో పెరోల్‌పై బయటకు వచ్చారు.
ప్రభుత్వ ఉద్యోగులకు ఎస్‌బీఐ చౌక గృహ రుణాలు
ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ ఎస్‌బీఐ తాజాగా చౌక గృహ రుణాలను ప్రకటించింది. ఏడవ వేతన కమిషన్ వల్ల ప్రయోజనం పొందిన రక్షణ సహా ఇతర రంగాలకు చెందిన ప్రభుత్వోద్యోగులకు బ్యాంకు ఈ రుణాలను ఆఫర్ చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘ఎస్‌బీఐ ప్రివిలేజ్ హోమ్ లోన్’, రక్షణ రంగ ఉద్యోగులకు ‘ఎస్‌బీఐ శౌర్య హోమ్ లోన్’ అనే రెండు రకాల గృహ రుణాలను ప్రవేశపెడుతున్నట్లు ఎస్‌బీఐ తెలియజేసింది. ఈ రుణాలకు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజూ ఉండ దని, రుణ గ్రహీతలు 75 ఏళ్లు వచ్చే వరకు రీ-పేమెంట్ (ఈఎంఐ) చెల్లించవచ్చని పేర్కొంది.
బీఈఎల్ షేర్ల బైబ్యాక్
రక్షణ రంగ ప్రభుత్వ దిగ్గజ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ (బీఈఎల్) రూ.2,171 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను బైబ్యాక్ చేయనుంది. 1.66 కోట్ల షేర్లను షేర్‌కు రూ.1,305 చెల్లించి కొనుగోలు చేయనున్నట్లు బీఎస్‌ఈకి పంపిన సమాచారంలో తెలిపింది. బీఈఎల్‌లో ప్రభుత్వ వాటా 75.02 శాతం. తాజా బైబ్యాక్ ద్వారా ప్రభుత్వానికి కొంత మొత్తంలో నిధులు సమకూరనున్నాయి.
ఏడు ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు ఓకే
ప్రభుత్వం రూ.300 కోట్ల విలువైన ఏడు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. వీటిల్లో రూ.267 కోట్ల విలువైన టికోన డిజిటల్ నెట్‌వర్క్స్ ప్రతిపాదన ప్రధానమైనది. లారస్ ల్యాబ్స్ ఎఫ్‌డీఐ ప్రతిపాదనకు మార్గం సుగమమైంది. ఐదు ప్రతిపాదనలను ఎఫ్‌ఐపీబీ తిరస్కరించింది. మరో ఏడింటిపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఫైనాన్షియల్ టైమ్స్, హెచ్‌ఎస్‌బీసీ సెక్యూరిటీస్, క్యాపిటల్ మార్కెట్స్, మెర్గాన్ స్టాన్లీ ఇండియా ప్రైమర్ డీలర్ ప్రతిపాదనలపై నిర్ణయాన్ని వాయిదా వేసింది.
డీల్స్..
⇔ హైదరాబాద్ కేంద్రంగా పునరుత్పాదక రంగంలో సేవలందిస్తున్న మిత్ర వాయు (ఎంవీటీపీఎల్) 31 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. ఏపీలో 200 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేసేందుకుగాను గుయామా పీఆర్ హోల్డింగ్స్ ఈ పెట్టుబడులు పెట్టిందని మిత్ర ఎనర్జీ తెలిపింది.
⇔ ఇజ్రాయెల్‌కు చెందిన క్లౌడ్ కంపెనీ క్లౌడిన్‌లో సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ రూ.27 కోట్లు పెట్టుబడులు పెట్టింది.
⇔ విప్రో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీరింగ్(డబ్ల్యూపీఎన్) కంపెనీ ఇజ్రాయెల్‌కు చెందిన హెచ్ ఆర్ గివోన్‌ను కొనుగోలు చేయనున్నది.