బడ్జెట్‌లో ఉద్దీపనలకు అవకాశం
ఇండియా రేటింగ్స్ అంచనా
• పెద్దనోట్ల రద్దుతో వృద్ధి పునరుద్ధరణకు సహాయక చర్యలు తప్పవని విశ్లేషణ
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో ఆర్థిక వృద్ధి మందగమనం, రికవరీ చర్యలు తీసుకోవాల్సిన తక్షణ అవసరం నేపథ్యంలో ఫిబ్రవరి1 బడ్జెట్‌లో సహాయక చర్యలు ప్రకటించే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ బుధవారంనాడు అంచనావేసింది. ఒకపక్క ప్రపంచ ఆర్థిక అనిశ్చితి కొనసాగుతుండగా, మరోపక్క పెద్ద నోట్ల రద్దు భారత్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిందని ఈ ఫిచ్ గ్రూప్ అనుబంధ సంస్థ తన తాజా నివేదికలో పేర్కొంది. బడ్జెట్‌లో ఉద్దీపన చర్యలకు అవకాశాలు ఉన్నాయని పేర్కొంటూ సంస్థ ఈ నివేదికను విడుదల చేసింది.
జీడీపీ 6.8 శాతమే!
నివేదిక అంచనాల ప్రకారం భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 6.8 శాతానికి పడిపోతుంది. ఇంతక్రితం ఈ అంచనా 7.8 శాతం. ప్రస్తుత పరిస్థితి ప్రాతిపదికన చూస్తే– 2017–18 ఆర్థిక సంవత్సరంలో కూడా ఆర్థిక వృద్ధిపై కొంత ప్రతికూల ప్రభావం ఉండే వీలుంది. ముఖ్యంగా అసంఘటత రంగంపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం తీవ్రంగా ఉంది. ఆర్థిక క్రియాశీలత తగ్గింది. ఉపాధి అవకాశాలపై ఈ ప్రభావం పడింది. కేంద్ర, రాష్ట్రాల వ్యయాలపైన సైతం స్వల్పకాలంలో డీమోనిటైజేషన్ ప్రభావం ఉంది. ఆయా అంశాలు బడ్జెట్‌లో ఉద్దీపన చర్యలకు దారితీస్తామని భావిస్తున్నాం. అయితే ఈ ఉద్దీపనలు వినియోగంవైపునగానీ లేదా పెట్టుబడుల రూపంలోగానీ ఉండే వీలుంది. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో ద్రవ్యలోటు లక్ష్యాలపై (2017–18లో జీడీపీలో 3 శాతం) కొంత రాజీపడాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు.
అక్టోబర్–డిసెంబర్‌లలో వృద్ధి 6 శాతం: నోమురా
కాగా పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు 6%గా ఉంటుందని జపాన్ ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ– నోమురా అంచనావేసింది. తదుపరి త్రైమాసికంలో ఇది మరింతగా 5.7 శాతానికి పడిపోతుందనీ విశ్లేషించింది. నోట్ల రద్దు కీలకమైన వినియోగం, సేవల రంగాలపై తీవ్ర ప్రభావం చూపినట్లు పేర్కొంది.