
న్యూఢిల్లీ: మౌలిక రంగ దిగ్గజ కంపెనీ ఎల్ అండ్ టీ 2017–18 జనవరి–మార్చి క్వార్టర్‌లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.3,167 కోట్ల నికర లాభం సాధించింది. 2016–17 క్యూ4లో రూ.3,025 కోట్ల నికర లాభం ఆర్జించామని, 5 శాతం వృద్ధి సాధించామని ఎల్ అండ్ టీ తెలిపింది. కంపెనీ నికర లాభం విశ్లేషకుల అంచనాలను మించింది. ఈ కంపెనీ నికర లాభం రూ.2,994 కోట్లకు పడిపోవచ్చని నిపుణులు అంచనా వేశారు.
స్థూల ఆదాయం 36,828 కోట్ల నుంచి 10 శాతం వృద్ధితో రూ.40,678 కోట్లకు ఎగసింది. మొత్తం వ్యయాలు కూడా రూ.33,464 కోట్ల నుంచి రూ.36,198 కోట్లకు పెరిగాయి. ట్రెజరీ కార్యకలాపాల లాభాల వల్ల ఇతర ఆదాయం 5 శాతం పెరిగిందని కంపెనీ తెలిపింది. నిర్వహణ లాభం 24% పెరిగి రూ.5,390 కోట్లకు, నిర్వహణ లాభ మార్జిన్ 13.2%కి చేరాయి. ఒక్కో షేర్‌కు రూ.16 తుది డివిడెండ్‌ను ఇవ్వనున్నామని వివరించింది. ఐటీ, టెక్నాలజీ సర్వీసుల సెగ్మెంట్ ఆదాయం 24% వృద్ధితో రూ.3,075 కోట్లకు పెరిగింది.
జోరుగా ఆర్డర్లు...
గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో మొత్తం ఆర్డర్లు 5 శాతం వృద్ధితో రూ.49,557 కోట్లకు పెరిగాయని ఎల్ అండ్ టీ తెలిపింది. మొత్తం ఆర్డర్లలో 18 శాతంగా ఉన్న అంతర్జాతీయ ఆర్డర్లు రూ.8,678 కోట్లకు చేరాయి. ఈ ఏడాది మార్చి నాటికి మొత్తం ఆర్డర్‌లు రూ.2,63,107 కోట్లకు పెరిగాయని, దీంట్లో అంతర్జాతీయ ఆర్డర్ల వాటా 24 శాతంగా ఉందని వివరించింది. మౌలిక రంగ ఆర్డర్లు 27 శాతం ఎగసి రూ.33,455 కోట్లకు పెరిగాయి.
ఈ ఏడాది మార్చి నాటికి ఈ రంగం ఆర్డర్లు రూ.1,95,419 కోట్లుగా ఉన్నాయని పేర్కొంది. విద్యుత్తు విభాగం ఆర్డర్లు 32 శాతం తగ్గి రూ.9,357 కోట్లకు తగ్గగా, భారీ ఇంజనీరింగ్ ఆర్డర్ బుక్ 13 శాతం పెరిగి రూ.13,523 కోట్లకు ఎగసిందని తెలిపింది. హైడ్రోకార్బన్ సెగ్మెంట్ ఆర్డర్లు 7 శాతం వృద్ధితో రూ.26,590 కోట్లకు పెరిగాయని పేర్కొంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 12.–15 శాతం రేంజ్‌లో, ఆర్డర్లు 10–12 శాతం రేంజ్‌లో పెరగగలవని కంపెనీ అంచనా వేస్తోంది.
మెరుగుపడుతున్న పెట్టుబడి వాతావరణం..
జీఎస్‌టీ, రెరా, దివాలా చట్టం వంటి సంస్కరణలు దీర్ఘకాలంలో వృద్ధికి దోహదపడతాయి కానీ గత ఏడాది ప్రతికూల ప్రభావమే చూపించాయని ఎల్ అండ్ టీ పేర్కొంది. ఈ సంస్కరణలతో పాటు, వివిధ సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టడం, మేక్ ఇన్ ఇండియా వంటి ప్రభుత్వ విధానాలు, మౌలిక రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం.. ఈ అంశాలన్నీ దేశంలో పెట్టుబడి వాతావరణాన్ని పెంపొందిస్తాయని ఆశాభావం వ్యక్తంచేసింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఎల్ అండ్ టీ షేర్ 2.5 శాతం లాభంతో రూ.1,378 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment