
చైనా ఉత్పత్తులకు మళ్లీ ఆదరణ!
బీజింగ్ : కొన్నేళ్ల క్రితం వరకూ 'మేడ్ ఇన్ చైనా' ఉత్పత్తులకు అసలు ఆదరణ ఉండేది కాదు. అలాంటిది ప్రస్తుతం వాటికి డిమాండ్ పెరుగుతోందట. చైనాలోనే కాదు.. విదేశాల్లో సైతం వీటికి గిరాకీ ఎక్కువగానే ఉందట. ఈ ఉత్పత్తులు చౌకగా లభ్యం కావడంతో పాటు, నాణ్యతలోనూ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుండటంతో ఆదరణ కోల్పోయిన తన మార్కెట్ కు తానే ఓ గౌరవాన్ని సంపాదించుకుందట. 2011 వరకూ 70 శాతం స్మార్ట్ ఫోన్లు చైనాలో అమ్ముడుపోతే, అవన్నీ శామ్ సంగ్, యాపిల్, నోకియా ఫోన్లే. కనీసం వారి ఉత్పత్తులను ఆ దేశస్తులే కొనలేనంతగా ఆదరణ కోల్పోయారు. తమ ఉత్పత్తుల్లో అసలు నాణ్యత ఉండదని ఆ దేశ ప్రజలే ఒప్పుకొన్నారు. అలాంటి చైనా ఉత్పత్తులను ఐదేళ్ల తర్వాత చూస్తే... ప్రస్తుతం వాటి చరిత్ర మారిపోయిందట.
చైనాలో స్వదేశీ స్మార్ట్ ఫోన్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిందట. ప్రస్తుతం చైనాలో టాప్-10 స్మార్ట్ ఫోన్ బ్రాండ్లలో 8 చైనావే ఉన్నాయట. అంతర్జాతీయ ప్రమాణాలను అందిపుచ్చుకొని తన ఉత్పత్తుల్లో నాణ్యత పెంచుకోవడంతో వీటికి డిమాండ్ పెరిగిందని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. 'మేడ్ ఇన్ చైనా' గౌరవాన్ని, ప్రతిష్టను మార్చడంలో స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా సహకరించాయని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో 'మేడ్ ఇన్ చైనా' ఉత్పత్తులు మళ్లీ మార్కెట్లకి ఆశ్చర్యాన్ని కలిగించవచ్చని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.