మహీంద్రా విమానాలు వస్తున్నాయ్...
మెల్‌బోర్న్: మహీంద్రా గ్రూప్ ఆస్ట్రేలియాలో తయారు చేసే విమానాలను భారత్‌లో విక్రయించడానికి ఆమోదం లభించింది. నిబంధనల్లో మార్పు కారణంగా తమ విమానాలకు ఆమోదం లభించిందని మహీంద్రా గ్రూప్ సీఎండీ ఆనంద్ మహీంద్రా చెప్పారు. మహీంద్రా జిప్స్ పేరుతో 5 నుంచి 10 సీట్లు ఉన్న ఈ విమానాలను మహీంద్రా గ్రూప్ ఆస్ట్రేలియాలో తయారు చేస్తోంది. భారత్‌లో నలుగురు ప్రయాణించే విమానాలకు మాత్రమే ప్రభుత్వ ఆమోదం ఉంది. దీంతో ఈ విమానాల విక్రయానికి ఆమోదం దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉంది. తాజాగా అంతర్జాతీయ ధ్రువీకరణ ప్రమాణాలకనుగుణంగా నిబంధనలను మార్చామని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. దీంతో మహీంద్రా విమానాలను భారత్‌లో విక్రయించడానికి ఆమోదం లభించింది.
ప్రధాని పనితీరు భేష్
2009లో మహీంద్రా కంపెనీ రెండు ఆస్ట్రేలియా విమాన సంస్థల్లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. అంతర్జాతీయ మార్కెట్ కోసం విమానాలు, సంబంధిత విడి భాగాలు తయారు చేసి విక్రయించే యోచనలో భాగంగా మహీంద్రా కంపెనీ ఈ రెండు సంస్థల్లో ఒక్కో దాంట్లో 75 శాతం వాటాను రూ.175 కోట్లకు కొనుగోలు చేసింది. వీటి ద్వారా విమానాలు తయారు చేసి కాలిఫోర్నియాలో విక్రయిస్తున్నామని ఆనంద్ మహీంద్రా చెప్పారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యాపారానికి అనుకూల వాతావరణం కల్పిస్తోందని ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించారు. ఆస్ట్రేలియా సందర్శిస్తున్న సీఈఓ ప్రతినిధి బృందంలో ఆనంద్ మహీంద్రా కూడా ఉన్నారు. నరేంద్ర మోదీ వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ, అడ్డంకులు తొలగిస్తున్నారని ప్రశంసించారు. ప్రధాని నరేంద్ర మోదీ మేక్ ఇన్ ఇండియా విజయవంతమైతే, భారీ స్థాయిలో ముడి పదార్ధాలు అవసరమవుతాయని ఆస్ట్రేలియాతో వ్యాపార అవకాశాలు అపారంగా పెరుగుతాయని పేర్కొన్నారు.