దక్షిణ కొరియా సంస్థపై మైక్రోమ్యాక్స్ కన్ను
సియోల్: దేశీ మొబైల్ సంస్థ మైక్రోమ్యాక్స్... దక్షిణ కొరియా కంపెనీ పాన్‌టెక్‌లో వాటాను కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. విదేశాలలో విస్తరించేందుకు వీలుగా పాన్‌టెక్‌లో వాటాను కొనుగోలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో పాన్‌టెక్ మూడో స్థానంలో ఉంది. అయితే విపరీతమైన పోటీ కారణంగా వరుసగా ఆరు క్వార్టర్లపాటు నష్టాలను ప్రకటించింది. దీంతో రుణ పునర్వ్యవస్థీకరణను చేపట్టింది. కాగా, వాటా కొనుగోలుకి ఆసక్తిగా ఉన్న విషయాన్ని పాన్‌టెక్ కంపెనీకి మైక్రోమ్యాక్స్ వెల్లడించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఎంతమేర వాటాను కొనుగోలు చేసేదీ, అలాగే వాటాకు సంబంధించిన విలువ తదితర వివరాలు వెల్లడికాలేదు. పాన్‌టెక్‌లో 9 రుణదాత సంస్థలు సంయుక్తంగా 37% వాటాను కలిగి ఉన్నాయి. ఇక క్వాల్‌కామ్‌కు 12%, శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్‌కు 10% చొప్పున వాటా ఉంది.
వ్యాఖ్యానించలేం: భాగస్వామ్యం, కొనుగోలు వంటి కార్యకలాపాలకు డెరైక్టర్ల బోర్డు ఆమోదముద్ర వేయాలని, దీంతోపాటు సంబంధిత నియంత్రణ సంస్థలు, నిబంధనలు అనుమతించాలని పాన్‌టెక్ కొనుగోలు అంశంపై మైక్రోమ్యాక్స్ స్పందించింది. ఊహాజనిత అంశాలపై వ్యాఖ్యానించబోమంది. దక్షిణ కొరియా మార్కెట్లో శామ్‌సంగ్, ఎల్‌జీ వంటి కంపెనీలతో పోటీ కారణంగా పాన్‌టెక్ ఆర్థిక ఇబ్బందులలో చిక్కుకుంది.