మిడ్‌క్యాప్ కన్నా లార్జ్‌క్యాప్ షేర్లే చౌక
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈవో నిమేష్ షా
వచ్చే ఏడాది నుంచి కార్పొరేట్ లాభాలు పెరుగుతాయి
♦ మూడేళ్ల కాలపరిమితితో ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయొచ్చు
♦ వచ్చే రెండేళ్లలో వడ్డీరేట్లు 1.5% వరకు తగ్గొచ్చు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఏడాదిన్నర కిందటికీ ఇప్పటికీ స్టాక్ మార్కెట్లో చాలా తేడా వచ్చిందని, ఇపుడు రిస్క్ పెరిగిందని చెబుతోంది ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎఫ్ సంస్థ. అందుకే ఇపుడు ఇన్వెస్ట్ చేసేవారు కనీసం మూడేళ్ల దృష్టితో పెట్టుబడి పెట్టాలని, గడిచిన రెండేళ్లుగా వస్తున్న లాభాలు ఈ ఏడాది కూడా వస్తాయని ఆశించటం అత్యాశేనని చెప్పారు సంస్థ ఎండీ, సీఈవో నిమేష్ షా. శుక్రవారం హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఆయన ఈక్విటీ, డెట్ మార్కెట్ల పనితీరుతో సహా పలు అంశాలపై మాట్లాడారు. ఆ వివ రాలివీ...
చౌక కాదు... ఖరీదూ కాదు!
విలువ పరంగా చూస్తే దేశీయ మార్కెట్లు బాగా చౌకగా ఉన్నాయని చెప్పలేం. అలా అని మరీ ఖరీదని కూడా చెప్పలేం. ఏడాదిన్నర కిందటితో పోలిస్తే మార్కెట్లో కొద్దిగా రిస్క్ పెరిగింది. దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో తొలిసారిగా లార్జ్ క్యాప్ షేర్లతో పోలిస్తే మిడ్‌క్యాప్ షేర్లు విలువ పరంగా అధిక ధరలో ట్రేడ్ అవుతున్నాయి. ఏడాదిన్నర క్రితం 3-4 పీఈ వద్ద ఉన్న మిడ్‌క్యాప్ షేర్లలో చాలా షేర్లు 30-40 పీఈ కంటే అధికంగా ట్రేడ్ అవుతున్నాయి. కానీ ఇదే సమయంలో ప్రతి 100 లార్జ్‌క్యాప్ షేర్లలో 20 మాత్రమే అధిక పీఈ వద్ద ట్రేడ్ అవుతున్నాయి. రిస్క్ రివార్డ్ నిష్పత్తి ప్రకారం చూస్తే మిడ్ క్యాప్ కంటే లార్జ్ క్యాప్ షేర్లే ఆకర్షణీయంగా ఉన్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం మూడు నుంచి నాలుగేళ్ల దృష్టితో లార్జ్‌క్యాప్ షేర్లలో ఇన్వెస్ట్ చేయమని సూచిస్తున్నాం.
కనిష్ట స్థాయికి ఆర్‌వోఈ : కార్పొరేట్ల లాభాలు చాలా తక్కువగా ఉన్నాయి. వాటి లాభాల ఆర్జన(ఆర్‌వోఈ) కనిష్ట స్థాయికి చేరింది. కంపెనీల వాటి సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం లేదు. ఈ ఏడాది కూడా కంపెనీలు ఆదాయాలు అంతగా వృద్ధి కాకపోవచ్చు. అక్టోబర్ నుంచి ప్రభుత్వం రైల్వేలు, రహదారులపై పెద్ద ఎత్తున వ్యయం చేయనుండటంతో వచ్చే ఏడాది నుంచి కంపెనీల లాభాలు పెరిగే అవకాశం ఉంది. కంపెనీల ఉత్పత్తి సామర్థ్యం 20 శాతం పెంచుకుంటే లాభాలు 40 నుంచి 50 శాతం పెరుగుతాయి. ఇది జరిగితే రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా పెరుగుతుంది. వచ్చే మూడేళ్లలో కంపెనీల లాభాలు మెరుగవుతాయని అంచనా వేస్తున్నాం.
బుల్ రంగాలు..: కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో ఇన్‌ఫ్రా రంగానికి నిధులు పెద్ద ఎత్తున కేటాయించింది. వర్షాకాలం తర్వాత అక్టోబర్ నుంచి ఈ నిధుల కేటాయింపులు మొదలవుతాయని అంచనా వేస్తున్నాం. అందుకే ఈ రంగంతో నేరుగా సంబంధం ఉండే ఆటోమొబైల్, ఆటో మొబైల్ కాంపొనెంట్స్, రోడ్లు, రైల్వేలు, ప్రైవేటు బ్యాంకులు, ఇంజనీరింగ్ రంగాలతో పాటు ఎగుమతులపై ఆధారపడ్డ ఐటీ రంగాలపై బుల్లిష్‌గా ఉన్నాం. ఇదే సమయంలో రంగాలతో సంబంధం లేకుండా అధిక పీఈ వద్ద ట్రేడ్ అవుతున్న షేర్లకు దూరంగా ఉంటున్నాం.
వడ్డీరేట్లు ఎందుకు తగ్గుతాయంటే..
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో వడ్డీరేట్లు పెరుగుతుంటే ఒక్క ఇండియాలో మాత్రమే తగ్గనున్నాయి. సాధారణంగా వడ్డీరేట్లు రిటైల్ ద్రవ్యోల్బణం కంటే తక్కువ ఉంటాయి. గతంలో రిటైల్ ద్రవ్యోల్బణం 11 శాతం ఉంటే వడ్డీరేట్లు 10 శాతంలోపు ఉండేవి. కానీ ఇప్పుడు రిటైల్ ద్రవ్యోల్బణం 5.5 శాతం ఉంటే అంత కంటే అధిక స్థాయిలో వడ్డీరేట్లున్నాయి. అంతర్జాతీయంగా చమురు, లోహాల ధరలు తగ్గుతుండటంతో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి వడ్డీ రేట్లు దిగి రాక తప్పదు. వచ్చే రెండేళ్ళలో వడ్డీరేట్లు 100 నుంచి 150 బేసిస్ పాయింట్లు తగ్గుతాయని అంచనా వేస్తున్నాం. వడ్డీరేట్లు తగ్గేసమయంలో డెట్ పథకాలు కూడా మంచి రాబడులను అందిస్తాయి.
భారీగా నిధులు
దేశీ ఈక్విటీ మార్కెట్లపై రిటైల్ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. గత రెండేళ్లలో కొత్తగా 20 లక్షల మ్యూచువల్ ఫండ్ ఖాతాలు ప్రారంభం కావడమే దీనికి నిదర్శనం. 2007లో అన్ని బ్యాంకుల డిపాజిట్ల విలువ రూ.30 లక్షల కోట్లుగా ఉంటే ఇప్పుడిది రూ.90 లక్షల కోట్లకు చేరింది. ఇదే సమయంలో ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడి విలువ రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.4 లక్షల కోట్లకు చేరింది. మున్ముందు వడ్డీరేట్లు తగ్గే అవకాశం ఉండటంతో డిపాజిట్ల నుంచి ఇతర అసెట్స్‌లోకి నగదు బదిలీ అవుతుంది. ప్రస్తుత తరుణంలో బంగారం, రియల్ ఎస్టేట్ ఆకర్షణీయంగాలేవు కనక అధిక మొత్తం ఈక్విటీల్లోకి వచ్చే చాన్స్ ఉంది. అమెరికా వడ్డీరేట్లు పెం చినా ఆ ప్రభావం మన మార్కెట్లపై అంతగా ఉండదు. ఈ సమయంలో మార్కెట్లు పడితే వాటిని కొనుగోళ్లకు వినియోగించుకోండి.