రియల్టీ సంస్థ కే రహేజా గ్రూప్‌నకు చెందిన మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ ఆర్‌ఈఐటీ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ముంబై సంస్థ రహేజా గ్రూప్ ప్రమోట్ చేసిన మైండ్‌స్పేస్ బిజినెస్‌లో పీఈ దిగ్గజం బ్లాక్‌స్టోన్ గ్రూప్ సైతం ఇన్వెస్ట్ చేసింది. ఈ నెలాఖరుకల్లా మైండ్‌స్పేస్ ఆర్‌ఈఐటీ పబ్లిక్ ఇష్యూ చేపట్టనుంది. ఇందుకు వీలుగా ఇప్పటికే మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద కే రహేజా గ్రూప్ ఆఫర్ డాక్యుమెంట్‌ను దాఖలు చేసింది.
చివరి వారంలో
తాజాగా అందిన వివరాల ప్రకారం మైండ్‌స్పేస్ ఆర్‌ఈఐటీ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 27న ప్రారంభమై 29న ముగియనుంది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 4,500 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. ఇందుకు వీలుగా కే రహేజా గ్రూప్‌తోపాటు బ్లాక్‌స్టోన్ రూ. 3,500 కోట్ల విలువైన యూనిట్స్‌ను విక్రయించనున్నాయి. అంతేకాకుండా రూ. 1,000 కోట్ల విలువైన యూనిట్లను సైతం అదనంగా జారీ చేయనున్నాయి.
పలు సంస్థలు
మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్‌లో క్యాపిటల్ ఇన్‌కమ్ బిల్డర్, అమెరికన్ ఫండ్స్ ఇన్సూరెన్స్ సిరీస్, జీఐసీ ప్రయివేట్ లిమిటెడ్ తదితర పలు సంస్థలు ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఆఫర్ డాక్యుమెంట్‌లో కంపెనీ పేర్కొంది. యూనిట్‌కు రూ. 275 ధరలో 4.09 కోట్ల యూనిట్లను జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇష్యూలో ఇది 25 శాతం వాటాకు సమానంకాగా.. తద్వారా రూ. 1125 కోట్లను సమకూర్చుకోనున్నట్లు సంబంధితవర్గాలు తెలియజేశాయి.
రెండో కంపెనీ
ఐపీవో ద్వారా మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన రెండో ఆర్‌ఈఐటీగా నిలవనుంది. గతంలో పీఈ సంస్థ బ్లాక్‌స్టోన్ ఇన్వెస్ట్‌చేసిన ఎంబసీ ఆఫీస్ పార్క్స్ ఆర్‌ఈఐటీ రూ. 4,750 కోట్లను సమీకరించడం ద్వారా 2019 ఏప్రిల్‌లో లిస్టయ్యింది. కాగా.. వివిధ సంస్థల ద్వారా మైండ్‌స్పేస్ ఆర్‌ఈఐటీలో ప్రస్తుతం బ్లాక్‌స్టోన్ 15 శాతం వాటాను కలిగి ఉంది. ముంబై, పుణే, హైదరాబాద్, చెన్నైలలో 29.5 మిలియన్ చదరపు అడుగుల లీజబుల్ ఏరియాను మైండ్‌స్పేస్ ఆర్‌ఈఐటీ కలిగి ఉన్నట్లు కే రహేజా కార్ప్ పేర్కొంది. వీటి విలువ రూ. 23,675 కోట్లుగా అంచనా. హైదరాబాద్‌లో మైండ్‌స్పేస్ మాధాపూర్, మైండ్‌స్పేస్ పోచారం ఆస్తులను కలిగి ఉన్న సంగతి తెలిసిందే.
డివిడెండ్ల ఆదాయం
ఆర్‌ఈఐటీలు సాధారణంగా నికర లాభాల నుంచి వాటాదారులకు అధిక మొత్తంలో డివిడెండ్లను పంచుతుంటాయి. అయితే గత బడ్జెట్‌లో కంపెనీలపై విధించే డివిడెండ్ పంపిణీ పన్ను(డీడీటీ) స్థానే వ్యక్తిగత(డివిడెండ్ అందుకునే వారిపై) పన్నులను ప్రతిపాదించిన విషయం విదితమే. కాగా.. కోవిడ్-19 కారణంగా తలెత్తిన అనిశ్చిత పరిస్థితులతో పదేళ్ల కాలావధి గల జీసెక్యూరిటీల రేటు కనిష్టానికి చేరినట్లు రియల్టీ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సమయంలో మైండ్‌స్పేస్ ఐపీవోకు రావడం ద్వారా పోర్ట్‌ఫోలియోను పెంచుకునేందుకు పలు అవకాశాలు లభించనున్నట్లు అభిప్రాయపడ్డారు. కాగా.. కంపెనీ ప్రధానంగా ఐటీ, ఐటీ ఆధారిత సర్వీసుల కంపెనీల నుంచి అధికంగా ఆదాయం పొందుతుండటం సానుకూల అంశమని తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment