‘బొగ్గు’ తప్ప అన్నీ మసే..
మైనస్‌తో ప్రారంభమైన మౌలిక రంగం
* ఏప్రిల్‌లో వృద్ధి లేకపోగా 0.4% క్షీణత
న్యూఢిల్లీ: ఎనిమిది రంగాలతో కూడిన కీలక మౌలిక పరిశ్రమల విభాగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నెలలో (2015-16, ఏప్రిల్) తీవ్ర నిరాశను మిగిల్చింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఈ విభాగంలో అసలు వృద్ధి లేకపోగా క్షీణత నమోదయింది. ఉత్పత్తి విలువ 2014 ఏప్రిల్‌లో విలువతో పోలిస్తే 2015 ఏప్రిల్‌లో -0.4 శాతంగా నమోదయింది.
ఒక్క బొగ్గు రంగం మినహా మిగిలిన ఏడు రంగాలూ నిరాశాజనక ఫలితాలిచ్చాయి. స్టీల్ పరిశ్రమ వృద్ధిలోనే ఉన్నా... ఈ రేటు భారీగా పడిపోయింది. మంగళవారం ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష నేపథ్యంలో వెలువడిన తాజా ‘మౌలిక’ గణాంకాలు.. ‘పాలసీ రేటు తగ్గింపు’ ఆశలకు మరింత బలాన్ని ఇచ్చాయి. వార్షిక ప్రాతిపదికన ఏప్రిల్‌లో ఈ రంగాల పనితీరు చూస్తే...
బొగ్గు: వృద్ధి 6.2 శాతం నుంచి 7.9 శాతానికి పెరిగింది.
క్రూడ్ ఆయిల్: 0.1 శాతం క్షీణత మరింతగా 2.7 శాతం క్షీణతలోకి పడింది.
సహజవాయువు: క్షీణతలోనే ఉంది. అయితే ఇది 7.7% నుంచి 3.6%కి తగ్గింది.
రిఫైనరీ ప్రొడక్టులు: క్షీణత 1.9 శాతం నుంచి 2.9 శాతానికి పడింది.
ఎరువులు: 11.1 శాతం వృద్ధి రేటు 0.04 క్షీణతలోకి జారింది.
స్టీల్: 6.9 శాతం వృద్ధి 0.6 శాతం వృద్ధికి పడిపోయింది.
సిమెంట్: 7.3 శాతం క్షీణత నుంచి 2.4 శాతం క్షీణతలోకి జారింది.
విద్యుత్: 11.9 శాతం వృద్ధి రేటు 1.1 శాతం క్షీణతలోకి మళ్లింది.
వరుసగా రెండవ నెలా మైనస్‌లోనే...
ఎనిమిది పరిశ్రమల మౌలిక రంగం ఇలాంటి నిరాశాజనక ఫలితం ఇవ్వడం ఇది వరుసగా రెండవ నెల. నిజానికి గత ఏడాది నవంబర్ నుంచీ మౌలిక రంగం వృద్ధి రేటు పడిపోతూ వస్తోంది. నవంబర్‌లో 6.7 శాతం ఉన్న ఈ వృద్ధి రేటు, డిసెంబర్‌లో 2.4 శాతానికి అటు తర్వాత నెల జనవరిలో 1.8 శాతానికి, ఫిబ్రవరిలో 1.4 శాతానికి పడిపోతూ వచ్చింది. మార్చిలో -0.1 శాతంగా ఉన్న ఈ రేటు ఏప్రిల్‌లో మరింత దిగజారడం విచారకరం. కాగా గత ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఈ గ్రూప్ వృద్ధి రేటు 3.5 శాతం.