మొబైల్ కాంగ్రెస్‌లో మనసు దోచినవి ఇవే
Published Thu, Mar 9 2017 11:54 AM | Last Updated on Tue, Sep 5 2017 5:38 AM
ప్రతి ఏటా దిగ్గజ టెక్నాలజీ కంపెనీలు నిర్వహించే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్(ఎండబ్ల్యూసీ)-2017 ముగిసింది. మొత్తం ఐదు రోజుల పాటు జరిగిన కాంగ్రెస్‌లో పలు అంతర్జాతీయ మొబైల్ బ్రాండ్లు కొత్త మోడళ్లను పరిచయం చేశాయి. వీటిలో కొన్ని మొబైల్ ప్రేమికుల మనసును దోచేశాయి. అవేంటో ఓ లుక్కేద్దాం.
బ్లాక్ బెర్రీ
ఎండబ్ల్యూసీ కార్యక్రమానికి రెండు రోజుల ముందే బ్లాక్‌బెర్రీ కీ వన్ ఫోన్‌ను విడుదల చేసింది. టచ్ స్క్రీన్‌తో పాటు కీ ప్యాడ్‌ను కోరుకునే మొబైల్ లవర్స్ దీన్ని చూసి తెగ ముచ్చటపడిపోతున్నారు. టచ్ అండ్ టైప్ మోడల్ ఫోన్లను బ్లాక్ బెర్రీ గతంలో కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. దీని ధర సుమారు రూ. 40 వేలుగా ఉండొచ్చు.
హువాయి
ఈ కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ ఫోన్లు హువాయి పీ10, హువాయి పీ10 ప్లస్‌లను మార్కెట్లోకి విడుదల చేయబోతున్నట్లు ఎండబ్ల్యూసీలో ప్రకటించింది. డ్యూయల్ కెమెరా, 960 ఆక్టా కోర్ ప్రాసెసర్లు ఈ ఫోన్‌లో ప్రత్యేకతలు. హువాయి వాచ్ 2.0ను కూడా ప్రకటించింది. క్లాసిక్, స్పోర్ట్స్ రకాల్లో వాచ్ లభ్యమవనుంది.
ఎల్‌జీ
ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఎల్‌జీ జీ6 ఫోన్‌ను ఎల్‌జీ ఎండబ్ల్యూసీలో విడుదల చేసింది. 5.7 ఇంచుల స్క్రీన్, డాల్బీ విజన్ హెచ్‌డీఆర్, 821 క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్ దీని ప్రత్యేకతలు. ఈ ఫోన్ ధర, అందుబాటులోకి వచ్చే తేదీలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు.
మోటోరోలా
గత మూడేళ్లుగా మోటో వెర్షన్లతో మార్కెట్లోకి దూసుకొచ్చిన మోటోరోలా(లెనోవో).. తాజాగా మోటో జీ5, మోటో జీ5 ప్లస్‌లను ఎండబ్ల్యూసీలో విడుదల చేసింది. 3 జీబీ ర్యామ్, 13 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 430 ప్రాసెసర్ తదితరాలు. ధర సుమారుగా రూ.17,500/-. ఇండియాలో మే నెల నుంచి అందుబాటులోకి రానుంది.
నోకియా
గతంలో మొబైల్ సామ్రాజ్యాన్ని ఏలిన నోకియా 2017 ఎండబ్ల్యూసీలో పునఃప్రవేశం చేసింది. నోకియా 3310 పాత ఫోన్‌ను కొత్త రూపుతో విడుదల చేసింది. ఈ ఫోన్‌కు సోషల్‌మీడియాలో విపరీతంగా క్రేజ్ వచ్చింది. చాలామంది ఎప్పుడెప్పుడూ ఈ ఫోన్ మార్కెట్లోకి వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. నోకియా 6, నోకియా 5 మొబైల్స్‌ను కూడా నోకియా ప్రకటించింది. జూన్ లోపు ఇవన్నీ భారత మార్కెట్లోకి వస్తాయి.
శాంసంగ్
కొరియా దిగ్గజ కంపెనీ శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్3ను విడుదల చేసింది. దీంతోపాటు ఎస్ పెన్‌ను కూడా ప్రకటించింది.
సోనీ
ఈ కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ ఫోన్ సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్ ప్రీమియం ఫోన్‌ను ఎండబ్ల్యూసీలో ప్రకటించింది. 4కే హెచ్‌డీఆర్, 19 మెగాపిక్సల్ మోషన్ ఐ కెమెరా, క్వాల్‌కామ్ 835 స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్‌లతో ఈ ఫోన్ లభించనుంది. సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్ ఏ1, ఎక్స్ ఏ1 ఆల్ట్రా(మిడ్ రేంజ్ ఫోన్లు)ను విడుదల చేసింది.
Advertisement