అమ్మా.. నాన్నా... అలవాట్లు!!
► అప్పు తీర్చటం నుంచి బీమా దాకా వారే గురువులు
► మనీ మేనేజిమెంట్‌లో తల్లిదండ్రుల ప్రభావమే అధికం
మనం ఏం నేర్చుకున్నా దాన్లో తల్లిదండ్రుల పాత్రే ఎక్కువ. పొదుపు, ఖర్చు అలవాట్లు కూడా వచ్చేది వారి నుంచే. నిజం చెప్పొద్దూ!! ఎవరైనా తమ కలల్ని, జీవిత లక్ష్యాల్ని సాకారం చేసుకోవటానికి ఆర్థిక విషయాలు తెలిసి ఉండటమనేది అత్యంత కీలకం. అందుకని మనకు సంక్రమించిన ఖర్చు, పొదుపు అలవాట్లను విశ్లేషించుకోవటంలో తప్పు లేదు. చక్కని జీవితానికి చక్కని అలవాట్లే పునాది. దాన్లో చెడు ఉంటే గనక... ఆదిలోనే తుంచేయాలి. సదరు అలవాట్ల సింçహావలోకనమే ఈ ప్రయత్నం.
రుణాల చెల్లింపులెలా ఉన్నాయ్?
ఆ మధ్య కోపెన్‌హెగన్ యూనివర్సిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్లు ఓ ఆసక్తికరమైన అధ్యయనం చేశారు. 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న 50 లక్షల మందికి చెందిన 3 కోట్ల రుణాలను విశ్లేషించారు. 2011– 2014 మధ్య తీసుకున్న రుణాలవి. వాళ్లు కనుక్కున్నదేమిటంటే... తల్లిదండ్రులు గనక రుణాలు తిరిగి చెల్లించటంలో డీఫాల్ట్ అయితే... వారి పిల్లలూ డీఫాల్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువని.
ఇవి ఎంత ఎక్కువంటే... డీఫాల్ట్ కాని తల్లిదండ్రుల పిల్లలకంటే దాదాపు నాలుగు రెట్లు!!. కుటుంబ ఆదాయాలు, తెలివితేటలతో సంబంధం లేకుండా అన్ని వర్గాలూ ఇలాగే ఉండటం గమనార్హం. దీన్నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటంటే... మీ తల్లిదండ్రులు రుణాల చెల్లింపులు ఎలా చేశారో తెలుసుకోవటమే కాదు. రుణాల విషయంలో మీ వైఖరినీ విశ్లేషించుకోండి. ఒక్కటి గుర్తుంచుకోండి!! తీసుకున్న అప్పును తిరిగి చెల్లించటమనేది నైతికంగా, చట్టపరంగా మీ బాధ్యత. అదేకాదు! చక్కని చెల్లింపు అలవాట్లు మీ క్రెడిట్ స్కోరునూ పెంచుతాయి. తద్వారా తక్కువ వడ్డీకే కొత్త రుణాలు దొరుకుతాయి.
సంప్రదాయ పాలసీలను కొనొద్దు...
ఓ తెలిసిన బంధువో, మిత్రుడో వచ్చి గ్యారంటీ లాభాలుంటాయంటూ సంప్రదాయ బీమా పాలసీలను అంటగట్టడం మనకు కొత్తేమీ కాదు. దీర్ఘకాలంలో ఇవన్నీ అర్థంలేని పాలసీలుగా మిగిలిపోతాయి. ఇలాంటి బీమా పాలసీల్లో ఇన్వెస్ట్ చేయటమనేది ఓ సమస్య కూడా. ఎందుకంటే ఈ ప్లాన్లలోని తప్పనిసరి లాకిన్ పీరియడ్ మిమ్మల్ని వాటి నుంచి బయటపడకుండా చేస్తుంది. ఒక వాటిపై వచ్చే రాబడి అత్యంత తక్కువ. దాని బదులు తగినంత కవరేజీ ఉండేలా టర్మ్ ప్లాన్ తీసుకుని, మిగిలిన మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్ల వంటి ఎక్కువ రాబడినిచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్ చేయటం తెలివైన పని.
తగినంత కవరేజీ ఉందా?
భారతీయుల్లో చాలామంది జీవిత బీమాను తీసుకునేది పన్నుల నుంచి బయటపడటానికే. కొందరు దాన్నో ఇన్వెస్ట్‌మెంట్‌లా కూడా చూస్తుంటారు. బీమా ఉన్న వ్యక్తి ఒకవేళ మరణించినా, ఆసుపత్రిలో ఉన్నా ఆ కుటుంబానికి వాస్తవంగా ఎంత రక్షణ కావాలన్నది మాత్రం వారు చూడరు. మీ కుటుంబ సభ్యులు కనక మీపై ఆధారపడి ఉంటే... మీపై ఆధారపడ్డ భార్య/భర్త తాలూకు ఆదాయ అవసరాలు, రుణ చెల్లింపులు, పిల్లల చదువు ఖర్చులు, ఆరోగ్య ఖర్చులు, ఇతర రోజువారీ అవసరాల వంటివన్నీ దృష్టిలో పెట్టుకుని అందుకు తగినంత బీమాను టర్మ్ ప్లాన్ రూపంలో తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే మీపై ఆధారపడ్డ వారిని అలా వదిలేయలేరు కదా!!
ఆరోగ్య బీమా లేదా?
చాలామంది ఆరోగ్య బీమా లేకుండానే తమ జీవితంలో చివరి మజిలీని చేరుకుని ఉంటారు. ఆ సమయంలో వారి ఆరోగ్యం చాలా ఒడిదుడుకులకు గురవుతుంటుంది. మరోవంక బీమా ఉండదు. ఆ సమయంలో ఆరోగ్య బీమా కొనుగోలు చేయటం కూడా చాలా కష్టం. పొరపాటున ఆసుపత్రి పాలయితే కుటుంబ పొదుపు, పెట్టుబడులు ఠక్కున ఆవిరయిపోతుంటాయి. ఈ సమస్యలన్నీ రాకుండా ఉండాలంటే యుక్త వయసు నుంచే చక్కని ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవటంతో పాటు దాన్ని చిరకాలం కొనసాగించాలి.
తెలివైన పెట్టుబడి సాధనాలున్నాయ్
మీకు కావాల్సినప్పుడు మీ డబ్బు మీ చేతికిరావాలి. చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో చాలావరకూ ఒక మోస్తరు రాబడినిస్తాయి కానీ పన్ను పరంగా అంత సమర్థమైనవి కావు. ఎండోమెంట్ బీమా పాలసీలంటే తక్కువ రాబడితో పాటు లాకిన్‌లూ ఉంటాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెనక్కి తీసుకోవచ్చు. కానీ పన్ను తప్పదు. అందుకని మెరుగైన ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలు వెతుక్కోవాలి. వీటన్నిటికీ జవాబిచ్చే మ్యూచువల్ ఫండ్లలో గడిచిన రెండేళ్లుగా ఇన్వెస్ట్‌మెంట్లు బాగా పెరుగుతున్నాయి. వాటిలో పన్ను ఆదాతో పాటు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రవేశించొచ్చు... బయటపడొచ్చు కూడా. రిస్కును బట్టే రాబడులుంటాయి. నెలకు రూ.500 నుంచి మొదలుపెట్టి ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు.
పుత్తడి ఎల్లవేళలా మెరవదు...
సంప్రదాయంగా బంగారం కూడా పెట్టుబడి సాధనంగా వస్తోంది. దాని ప్రయోజనాలు దానికున్నాయి. ఈ లోహాన్ని కావాల్సినట్టు మార్చుకోవచ్చు. పాడైపోదు. ఆభరణంగానూ వాడొచ్చు. కానీ పెట్టుబడిగా వచ్చేసరికి ప్యూరిటీ, మార్కెట్ రాబడి, దాచుకోవటమనే సమస్యలు దీనికీ ఉన్నాయి. ఆభరణంగా వాడుకోవాలంటే ‘బంగారం’లా కొనుక్కోవచ్చు. కానీ పెట్టుబడిగా అయితే మాత్రం మీ పోర్టుఫోలియోలో దాన్ని కొంతవరకే పరిమితం చేయాలి. గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్లు, గోల్డ్ సావరిన్ బాండ్ల వంటి సాధనాలను పరిశీలించొచ్చు.