మీ నేతలను కట్టడి చేయండి.. లేకుంటే..
* అంతర్జాతీయంగా విశ్వసనీయత కోల్పోతారు
* ప్రధాని మోదీకి మూడీస్ హెచ్చరిక
న్యూఢిల్లీ: గొడ్డు మాంసం తదితర వివాదాలతో వైషమ్యాలు చెలరేగుతున్న నేపథ్యంలో అధికారిక బీజేపీ నేతలను కట్టడి చేయడం శ్రేయస్కరమని ప్రధాని నరేంద్ర మోదీకి కన్సల్టెన్సీ సంస్థ మూడీస్ సూచించింది. లేని పక్షంలో ఇటు దేశీయంగాను, అటు అంతర్జాతీయంగాను విశ్వసనీయత కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
రాజ్యసభలో బీజేపీకి మెజారిటీ లేకపోవడంతో కీలక సంస్కరణలు విపక్షాలు మోకాలడ్డుతున్నాయనుకున్నా.. సొంత పార్టీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు బీజేపీకి చేటు చేస్తున్నాయని మూడీస్ అనలిటిక్స్ ఒక నివేదికలో పేర్కొంది. ఉద్రిక్తతలు మరింత పెరిగిన పక్షంలో రాజ్యసభలో విపక్షాల నుంచి వ్యతిరేకతా పెరుగుతుందని, ఆర్థిక విధానాలపై చర్చలు పక్కదారి పట్టే అవకాశం ఉందని వివరించింది.
కాబట్టి, మోదీ తన పార్టీ నేతలను అదుపులో ఉంచాలని లేదా.. దేశీయంగాను, అంతర్జాతీయంగాను విశ్వసనీయత కోల్పోయే రిస్కును ఎదుర్కొనక తప్పదని మూడీస్ హెచ్చరించింది. భారత్‌లో ఇటీవలి రాజకీయ వివాదాలపై మూడీస్ వంటి అంతర్జాతీయ సంస్థ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఇది తొలిసారి. మూడీస్ అనలిటిక్స్ అనేది మూడీస్ కార్పొరేషన్‌లో ఎకనమిక్ రీసెర్చ్, అనాలిసిస్ విభాగం. తమ వ్యాఖ్యలు స్వతంత్రమైనవేనని, మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్‌కి వీటికి సంబంధం లేదని మూడీస్ అనలిటిక్స్ పేర్కొంది.
మోదీ సారథ్యానికి బిహార్ ఎన్నికల పరీక్ష..
బిహార్‌లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మోదీ సారథ్యానికి చాలా కీలకమైనవని మూడీస్ తెలిపింది. బిహార్‌లో బీజేపీ విజయం సాధించగలిగితే ఎగువ సభలో పార్టీకి కొంత మెజారిటీ దక్కించుకునేందుకు తోడ్పాటు లభించగలదని పేర్కొంది
నివేదికలో మరిన్ని అంశాలు..
* తక్కువ వడ్డీ రేట్లు స్వల్పకాలికంగా ఎకానమీకి తోడ్పాటునిచ్చినా.. దీర్ఘకాలిక వృద్ధి సామర్థ్యాలను సాధించాలంటే సంస్కరణల అమలు తప్పనిసరి.
* 2015లో ఆర్‌బీఐ కీలక పాలసీ రేట్లు ఇక మార్చకపోవచ్చు. వచ్చే ఏడాది ప్రారంభంలో స్వల్పంగా తగ్గించవచ్చు.
* ఆర్‌బీఐ దగ్గర విదేశీ మారక నిల్వలు పుష్కలంగా ఉన్నందున.. ఒకవేళ అమెరికా వడ్డీ రేట్లు పెంచినా, రూపాయిపై పెద్దగా ప్రతికూల ప్రభావం ఉండకపోవచ్చు.