
టాలిన్/ముంబై: పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తాజాగా ఈ–గవర్నెన్స్ విభాగంపై దృష్టి సారించారు. ఇందుకు సంబంధించి ఎస్తోనియా ప్రభుత్వ మాజీ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ తావి కోట్కాతో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేశారు. ఈ–గవర్నెన్స్ సంబంధ సేవలందించేందుకు దీన్ని ఉద్దేశించినట్లు ఎస్తోనియా ఆర్థిక శాఖ సహాయ మంత్రి విల్యార్ లుబి తెలిపారు. యూరోపియన్ యూనియన్‌లో భాగమైన తమ దేశంలో ముకేశ్ అంబానీ ఈ–రెసిడెన్సీ కూడా పొందినట్లు ఎస్తోనియా వర్గాలు తెలిపాయి.
మరోవైపు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగుమతులకు సంబంధించిన ఆర్థిక లావాదేవీని బ్లాక్‌చెయిన్ టెక్నాలజీతో పూర్తి చేసినట్లు బ్రిటన్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌ఎస్‌బీసీ వెల్లడించింది. రిలయన్స్, అమెరికాకు చెందిన ట్రైకాన్ ఎనర్జీకి మధ్య ఇది జరిగినట్లు, భారత్‌లో ఈ తరహా బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ లావాదేవీ జరగడం ఇదే ప్రథమం అని పేర్కొంది. దీనివల్ల ఎగుమతి పత్రాల ధ్రువీకరణ ప్రక్రియకు పట్టే సమయం వారం, పదిరోజుల నుంచి ఒక్కరోజుకి తగ్గిపోతుందని రిలయన్స్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ శ్రీకాంత్ వెంకటాచారి తెలిపారు.