స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలను సమీక్షిస్తున్నాం..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వివిధ దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలను(ఎఫ్‌టీఏ) సమీక్షిస్తున్నట్టు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ కేంద్ర మంత్రి కల్రాజ్ మిశ్రా తెలిపారు. ఎఫ్‌టీఏల కారణంగా దేశీయ తయారీ రంగం కుదేలవుతోందంటూ కంపెనీలు ఆందోళన చెందుతున్న విషయం వాస్తవమేనని అన్నారు. ఇక్కడి కంపెనీలే తమకు ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. భారతీయ కంపెనీల ప్రయోజనాలను కాపాడతామని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తగు నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. హెచ్‌ఆర్ సేవల సంస్థ టీఎంఐ గ్రూప్ వాయిస్ ఆధారిత మొబైల్ సొల్యూషన్ ‘జాబ్స్‌డైలాగ్’ను మంగళవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించిన సందర్భంగా సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు.
ఒకే కార్మిక చట్టం..: ప్రస్తుతమున్న కార్మిక చట్టాల స్థానంలో ఎంఎస్‌ఎంఈ రంగం కోసం ఒకే చట్టాన్ని తీసుకొస్తున్నట్టు మిశ్రా తెలిపారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో దీనిని ప్రవేశపెడతామని పేర్కొన్నారు. టెక్నికల్ స్కూల్స్ ఏర్పాటుకు శాంసంగ్ తరహాలో మరిన్ని కంపెనీలతో చర్చిస్తున్నట్టు చెప్పారు. ఎంఎస్‌ఎంఈ నిర్వచనాన్ని మారుస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఇందుకోసం కమిటీ ఏర్పాటైందని చెప్పారు. పెట్టుబడి, కార్మికుల సంఖ్యనుబట్టి సూక్ష్మ, చిన్న, మధ్య, భారీ తరహా కంపెనీగా నిర్వచిస్తారు.
20 శాతం ఎంఎస్‌ఎంఈ నుంచే..
ప్రభుత్వ రంగ సంస్థలు ఎంఎస్‌ఎంఈల నుంచి 20 శాతం ఉత్పత్తులను కొనుగోలు చేయడం 2015 నుంచి తప్పనిసరి చేయనున్నట్టు మంత్రి తెలిపారు. ఎంఎస్‌ఎంఈ రంగం కోసం కొత్త పాలసీ తీసుకొచ్చే పనిలో ఉన్నట్టు చెప్పారు. ముసాయిదా విధానం మూడు నాలుగు నెలల్లో ప్రకటి ంచే అవకాశం ఉందన్నారు. విదేశాలతోపాటు ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను పరిశీలిస్తున్నామన్నారు. పాలసీలో చేర్చే అంశాలపై చర్చించేందుకు ఆర్థిక శాఖ, ఎంఎస్‌ఎంఈ, ఆర్‌బీఐకి చెందిన అధికారులతో కమిటీ ఏర్పాటైందన్నారు. ఎంఎస్‌ఎంఈ రంగ సమస్యలను పరిష్కరించే దిశగా బ్యాంకులతో సమావేశాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
33 లక్షల మందికి..
2014-15లో 33 లక్షల మంది యువతకు ఉపాధి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా చేసుకున్నామని నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ, సీఈవో దిలీప్ షెనాయ్ తెలిపారు. శిక్షణ తీసుకున్న వారిలో 63 శాతం మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయని, దీనిని 70 శాతానికి చేర్చాలన్నది తమ ధ్యేయమని చెప్పారు. తమ కార్యకలాపాలను అన్ని రాష్ట్రాలకు విస్తరించనున్నట్టు టీఎంఐ గ్రూప్ చైర్మన్ టి.మురళీధరన్ పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 13 లక్షల ఎంఎస్‌ఎంఈలు మూతపడిన ఫలితంగా 18 లక్షల మంది ఉపాధి కోల్పోయారని బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ తెలిపారు.