బడా ఐటీ కంపెనీల ఆదాయం అంతంతే! | News about IT companies' income | Sakshi
Sakshi News home page

బడా ఐటీ కంపెనీల ఆదాయం అంతంతే!

Published Mon, Jan 8 2018 2:01 AM | Last Updated on Mon, Jan 8 2018 4:18 AM

News about IT companies' income - Sakshi

న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (అక్టోబర్‌–డిసెంబర్‌) ఫలితాల సీజన్‌ ప్రారంభం అవుతుండగా, కీలకమైన ఐటీ, బ్యాంకింగ్‌ రంగంలోని కంపెనీల నుంచి పెద్దగా ఆశించేదేమీ లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బ్యాంకులు అధిక మొండి బకాయిలకు చేసే కేటాయింపులతో బలహీనమైన ఫలితాలను ప్రకటించనున్నాయని అంచనా. అదే సమయంలో తక్కువ పనిదినాలు, బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సేవల (బీఎఫ్‌ఎస్‌) విభాగం ఆదాయాలు చల్లబడినందున ఐటీ కంపెనీల ఫలితాలు గతం కంటే మెరుగ్గా ఉండకపోవచ్చని భావిస్తున్నారు.  

టీసీఎస్‌ డైరెక్షన్‌!
టీసీఎస్, ఇన్ఫోసిస్‌ కంపెనీల యాజమాన్యాలు డిమాండ్‌ గురించి ఏం వ్యాఖ్యానించనున్నాయనే అంశంపై ఇన్వెస్టర్లు ఎంతో ఆసక్తితో ఉన్నారు. అమెరికాలో పన్ను సంస్కరణలకు తోడు, వీసా నిబంధనల్లో ట్రంప్‌ సర్కారు చేయదలిచిన మార్పులు ఆందోళన కలిగించేవిగా విశ్లేషకులు భావిస్తున్నారు. మూడో క్వార్టర్‌ ఫలితాలను టీసీఎస్‌ ఈ నెల 11న విడుదల చేయనుంది. ఆ తర్వాత రోజు తర్వాత ఇన్ఫోసిస్, 19న విప్రో ఫలితాలను ప్రకటిస్తాయి. ‘‘టైర్‌–1 భారత ఐటీ కంపెనీల కరెన్సీ ఆదాయ అంచనా 1–1.8 శాతం మధ్య ఉంటుందని మా అంచనా.

సంవత్సరాంతం సెలవులు, బీఎఫ్‌ఎస్‌ విభాగం నుంచి వచ్చే ఆదాయం పుంజుకోకపోవడం వంటి అంశాలతో ఆదాయాల్లో వృద్ధి ఉండకపోచ్చు’’ అని కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ తన నివేదికలో పేర్కొంది. మధ్య స్థాయి కంపెనీలు మాత్రం అధిక వృద్ధిని నమోదు చేస్తాయని పేర్కొంది. 2018 బడ్జెట్‌లో ఐటీ రంగంపై చేసే ప్రకటనలు, వీసా ఆధారిత సవాళ్లను ఎదుర్కోవడంపై సన్నద్ధత, బీఎఫ్‌ఎస్‌ విభాగం తీరు అన్నవి ఇన్వెస్టర్లు పరిశీలించాల్సిన కీలకమైన అంశాలుగా మోతీలాల్‌ ఓస్వాల్‌ తెలిపింది.

మరోవైపు ఇన్ఫోసిస్‌ కొత్త సీఈవో సలిల్‌ పారిఖ్‌ కంపెనీ అభివృద్ధికి సంబంధించి ఏ విధానాన్ని ప్రకటించనున్నారనే అంశంపైనా ఆసక్తి నెలకొంది. అమెరికా కంపెనీలు విదేశాల్లోని తమ అనుబంధ కంపెనీలకు చేసే చెల్లింపులపై బేస్‌ ఎరోజన్‌ అండ్‌ యాంటీ అబ్యూజ్‌ ట్యాక్స్‌(బీట్‌)ను అమలు చేయడం వల్ల కొన్ని భారత కంపెనీలపై ప్రభావం ఉంటుందని కోటక్‌ పేర్కొంది.   

బ్యాంకింగ్‌ నిరాశాజనకం
దేశ బ్యాంకింగ్‌ రంగం డిసెంబర్‌ క్వార్టర్లో బలహీన ఫలితాలను ప్రకటించొచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీ నివేదిక ప్రకారం... ట్రెజరీల నుంచి వచ్చే ఆదాయం తగ్గడం, ఎన్‌పీఏలకు కేటాయింపులతో ఈ రంగం పనితీరు బలహీనంగా ఉంటుంది. అదే సమయంలో డిమాండ్‌ ఆశాజనకంగా ఉండడంతో ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలు మాత్రం బలమైన ఫలితాలు ప్రకటించొచ్చని కోటక్‌ అంచనా వేసింది.

ఎన్‌బీఎఫ్‌సీల ఫలితాలు 30–50 శాతం స్థాయిలో వృద్ధి నమోదు చేయవచ్చని పేర్కొంది. పండుగల డిమాండ్‌ పుంజుకోవడం, రెరా/జీఎస్టీ అమలుతో ఇళ్లకు రుణాల జారీ స్వల్పంగా మెరుగుపడడం, రుణాల వ్యయాలు తగ్గడం నిర్వహణ పరంగా ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలు బలమైన ఫలితాలు వెల్లడించడానికి తోడ్పడతాయని అంచనా వేసింది. బ్యాంకింగ్‌ రంగంలో రుణాల వృద్ధి 2016–17లో ఉన్న 4–5 శాతం నుంచి 7 శాతానికి మెరుగుపడినప్పటికీ, ఇంకా డీమోనిటైజేషన్‌ ముందు నాటి వృద్ధి రేటు 9–10 కంటే దిగువనే ఉందని పేర్కొంది.

కార్పొరేట్‌ రంగానికి రుణాల మంజూరు గణనీయంగా తగ్గిపోవడం, తాజా పెట్టుబడుల్లో మందగమనం అనేవి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మారకపోవచ్చని కోటక్‌ పేర్కొంది. కార్పొరేట్‌ రంగానికి 50 శాతానికి పైగా రుణాలిచ్చిన ప్రభుత్వరంగ బ్యాంకులను ఇది నిరాశపరిచేదేనని అభిప్రాయపడింది.  
 

రుణాల వృద్ధి 10.65 శాతానికి
ముంబై: చాలా కాలం తర్వాత డిసెంబర్‌లో రుణాల వృద్ధి మెరుగైన స్థాయికి చేరుకుంది. డిసెంబర్‌ 22తో ముగిసిన 15 రోజుల కాలానికి ఇది 10.65 శాతం, రూ.80,96,727 కోట్లుగా నమోదైంది. బేస్‌ ప్రభావమే దీనికి కారణమని ఆర్‌బీఐ గణాంకాల ఆధారంగా తెలుస్తోంది.

బేస్‌ ప్రభావమే రుణాల వృద్ధికి కారణమని, గతేడాది డీమోనిటైజేషన్‌ వల్ల బేస్‌ గణాంకాలను సవరించడం జరిగిందని, అందుకే వృద్ధి ఈ స్థాయిలో కనిపిస్తోందని ఎస్‌బీఐ రిటైల్, డిజిటల్‌ బ్యాంకింగ్‌ హెడ్‌ పేకే గుప్తా వివరించారు. రిటైల్‌ రుణాలకు డిమాండ్‌ పుంజుకోగా, కార్పొరేట్‌ రంగ రుణాల్లో మాత్రం ఎలాంటి పురోగతి లేదని గుప్తా స్పష్టం చేశారు. డిసెంబర్‌లో రిటైల్, ఆటో రుణాల జారీ పరంగా తాము అధిక గణాంకాలను నమోదు చేసినట్టు చెప్పారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement