న్యూఢిల్లీ: డిమాండ్ మెరుగుపడుతున్న దాఖలాలతో కంపెనీలు ఉత్పత్తిని పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా తయారీ రంగం గత నెల మళ్లీ కాస్త పుంజుకుంది. ఏప్రిల్‌లో 51.8 పాయింట్లుగా ఉన్న నికాయ్ ఇండియా తయారీ రంగ సూచీ (పీఎంఐ) మే నెలలో 52.7 పాయింట్లకు పెరగడం ఇందుకు నిదర్శనం. పీఎంఐ 50 పాయింట్ల పైన కొనసాగడం ఇది వరుసగా 22వ నెల కావడం గమనార్హం. పీఎంఐ 50కి పైన ఉంటే వృద్ధిని, అంతకన్నా దిగువన ఉంటే మందగమనాన్ని సూచిస్తుంది.
‘కొత్త ఆర్డర్ల రావడం మొదలు కావడంతో, డిమాండ్‌కి అనుగుణంగా ఉత్పత్తి చేయడంపై కంపెనీలు మరింతగా దృష్టి పెట్టాయి. దీంతో తయారీ రంగంలో ఉత్పత్తి కూడా వేగంగా పెరిగింది‘ అని పీఎంఐ సూచీ నిర్వహించే ఐహెచ్‌ఎస్ మార్కిట్ సంస్థ ప్రధాన ఆర్థికవేత్త, నివేదిక రూపకర్త పోల్యానా డి లిమా పేర్కొన్నారు. కొత్త ఆర్డర్లు వస్తుండటం, ఉత్పత్తి పెంపుపై కంపెనీలు ఆశావహంగా ఉండటం వంటి అంశాలతో తయారీ రంగంలో మరింత మందికి ఉపాధి కల్పన జరిగినట్లు వివరించారు.
ధీమాగా కంపెనీలు
ఏప్రిల్ నుంచి సెంటిమెంటు మెరుగుపడుతుండటంతో రాబోయే రోజుల్లోనూ ఉత్పత్తి పెంపుపై దేశీ తయారీ కంపెనీలు ధీమాగా ఉన్నాయి. వ్యాపారాలకు అనుకూలంగా ప్రభుత్వ విధానాలు, మార్కెటింగ్ వ్యూహాలు, పూర్తి కావడానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్టులు, సానుకూల ఆర్థిక పరిస్థితులు మొదలైన అంశాలు ఈ ఆశావహ దృక్పధానికి కారణమని నివేదికలో వెల్లడైంది. ద్రవ్యోల్బణ కోణంలో చూస్తే ధరలపరమైన ఒత్తిళ్లు పెద్దగా పెరగలేదని, ఉత్పత్తి వ్యయాల పెరుగుదల స్వల్పంగానే ఉండటం వల్ల కంపెనీలు రేట్లను పెద్దగా మార్చలేదని లిమా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment