న్యూఢిల్లీ: ఖాయిలాపడిన ప్రభుత్వ రంగ సంస్థల్లో (పీఎస్‌యూ) వ్యూహాత్మక వాటాల విక్రయానికి సంబంధించి ప్రభుత్వానికి ఇప్పటిదాకా 34 సంస్థలపై సిఫార్సులు చేసినట్లు నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తెలియజేశారు. ఖాయిలా పడిన సంస్థల లాభదాయకత అంశాన్ని పరిశీలించాలంటూ ప్రధాని కార్యాలయం (పీఎంవో) చేసిన సూచనల మేరకు నీతి ఆయోగ్ ఈ సిఫార్సులు చేసింది.
రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ నిర్వహించిన ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా కాంత్ ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పీఎస్‌యూల్లో వాటాల విక్రయం ద్వారా రూ. 72,500 కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకుంది. మైనారిటీ వాటాల అమ్మకం ద్వారా రూ. 46,500 కోట్లు, వ్యూహాత్మక వాటాల విక్రయం ద్వారా రూ.15,000 కోట్లు, పీఎస్‌యూ బీమా కంపెనీల లిస్టింగ్ ద్వారా రూ.11,000 కోట్లు సమీకరించనుంది.
బీమా నిధులు ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల్లోకి మళ్లించాలి..
మౌలిక రంగ ప్రాజెక్టుల్లో ప్రైవేట్ పెట్టుబడులు మరింతగా రావాలని అమితాబ్ కాంత్ అభిప్రాయపడ్డారు. అటు బీమా, పెన్షన్ ఫండ్స్ నిధులను కూడా ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల ఫైనాన్సింగ్ కోసం మళ్లించవచ్చని ఆయన సూచించారు. దీంతో పాటు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) స్కీమును పూర్తి స్థాయిలో పునఃపరిశీలించాలని కాంత్ పేర్కొన్నారు. తగినన్ని పెట్టుబడులు లేక దేశీ ఇన్‌ఫ్రా రంగం సుదీర్ఘకాలం సమస్యల్లో కొట్టుమిట్టాడిందని ఆయన చెప్పారు.
‘పెన్షన్, బీమా నిధులను ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల్లో పెట్టుబడులుగా మళ్లించేందుకు అనువైన పరిస్థితులుండాలి. వీజీఎఫ్ స్కీమ్‌ను కూడా పూర్తిస్థాయిలో పునఃసమీక్షించాలి‘ అని కాంత్ తెలిపారు. భారత్ 9–10 శాతం స్థాయిలో వృద్ధి సాధించాలంటే మౌలిక రంగాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దక్షిణ కొరియా, సింగపూర్, తైవాన్, జపాన్ తదితర దేశాల్లో మెరుగైన ఇన్‌ఫ్రా ఊతంతోనే వృద్ధి చెందాయని చెప్పారు.
మౌలిక రంగానికి రూ. 50 లక్షల కోట్లు కావాలి..
వచ్చే అయిదేళ్లలో 2022 నాటికి దేశీయంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో రూ. 50 లక్షల కోట్ల మేర పెట్టుబడులు అవసరమవుతాయని క్రిసిల్ ఒక నివేదికలో పేర్కొంది. మొత్తం ఇన్‌ఫ్రా పెట్టుబడుల్లో దాదాపు 78 శాతం.. విద్యుత్, రవాణా, పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన మొదలైనవే ఉండగలవని వివరించింది.
2016, 2017 ఆర్థిక సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం భారీగా వ్యయాలు చేయడం వల్లే.. ప్రైవేట్ పెట్టుబడులు భారీగా తగ్గినా.. రాష్ట్రాల ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితులు దిగజారినా.. ప్రభావం పాక్షికంగానే పడిందని క్రిసిల్ తెలిపింది. 2019 ఆర్థిక సంవత్సరం తర్వాత ప్రైవేట్ పెట్టుబడులు పుంజుకోగలవని పేర్కొంది.
2013–17 మధ్య కాలంలో భారత్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై పెట్టుబడులు రూ. 37 లక్షల కోట్లకు (స్థూల దేశీయోత్పత్తిలో సుమారు 5.6 శాతానికి) పెరిగాయని.. అంతకుముందు అయిదేళ్లలో ఇన్వెస్ట్ చేసిన రూ. 24 లక్షల కోట్ల పెట్టుబడులతో పోలిస్తే ఇది 56 శాతం అధికమని క్రిసిల్ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment