ఓఎన్‌జీసీ లాభం 19% అప్ | ONGC Q1 profit hurt by write-offs, subsidy payment | Sakshi
Sakshi News home page

ఓఎన్‌జీసీ లాభం 19% అప్

Published Thu, Aug 14 2014 1:59 AM | Last Updated on Sat, Sep 2 2017 11:50 AM

ఓఎన్‌జీసీ లాభం 19% అప్

ఓఎన్‌జీసీ లాభం 19% అప్

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆయిల్ దిగ్గజం ఓఎన్‌జీసీ ఈ ఏడాది తొలి క్వార్టర్(ఏప్రిల్-జూన్)లో రూ. 4,782 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది(2013-14) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 4,016 కోట్లతో పోలిస్తే ఇది 19% వృద్ధి. ముడిచమురుకి అధిక ధరలు లభించడం ఇందుకు దోహదపడింది. నికరంగా బ్యారల్‌కు 47.51 డాలర్ల ధర లభించినట్లు కంపెనీ తెలిపింది. గతంలో బ్యారల్‌కు 40.33 డాలర్లు నమోదైంది. ఈ కాలంలో సబ్సిడీ చెల్లింపులు 4% పెరిగి రూ. 13,200 కోట్లకు చేరాయి.

ప్రభుత్వ నియంత్రిత ధరలకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు విక్రయించే డీజిల్, కిరోసిన్, ఎల్‌పీజీలపై ఓఎన్‌జీసీ వంటి ఉత్పాదక సంస్థలు సబ్సిడీలు చెల్లించే సంగతి తెలిసిందే. కాగా, చమురు వెలికితీత కార్యకలాపాలకు సంబంధించి రూ. 3,828 కోట్లను రద్దు చేసినట్లు(రైటాఫ్) కంపెనీ వెల్లడించింది. ఇక ఈ కాలంలో 5.1 మిలియన్ టన్నుల చమురును ఉత్పత్తి చేయగా, గ్యాస్ ఉత్పత్తి 2% క్షీణించి 5.775 బిలియన్ ఘనపు మీటర్లకు పరిమితమైంది. అమ్మకాలు 13% పుంజుకుని రూ. 21,813 కోట్లను తాకాయి.

 సబ్సిడీ తరువాత
 స్థూలంగా బ్యారల్ చమురుకి 6% అధికంగా 109.48 డాలర్లు ధర లభించినట్లు కంపెనీ తెలిపింది. అయితే ఇంధన సబ్సిడీల చెల్లింపు తరువాత 47.51 డాలర్ల చొప్పున గిట్టుబాటు అయినట్లు పేర్కొంది. వెరసి ఒక్కో బ్యారల్ చమురుపై సబ్సిడీ డిస్కౌంట్‌కు 62.33డాలర్లను కేటాయించినట్లయ్యిందని వివరిం చింది. సబ్సిడీ డిస్కౌంట్‌ను మినహాయించకుంటే నికర లాభం రూ. 7,396 కోట్లమేర అధికంగా నమోదయ్యేదని తెలిపింది. కేజీ బేసిన్ పశ్చిమ ప్రాంతంలో కొత్తగా ఆరు ఆయిల్, గ్యాస్ క్షేత్రాలపై దృష్టిపెట్టినట్లు తెలిపింది.

 రిలయన్స్‌కు విక్రయం
 వెనిజులాలోని కొరబోబో ప్రాజెక్ట్‌లో ఉత్పత్తి చేసిన చమురులో తొలిసారిగా 1.2 మిలియన్ బ్యారళ్లను రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జామ్‌నగర్ రిఫైనరీకి విక్రయించినట్లు కంపెనీ వెల్లడించింది. వెనిజులా నుంచి గుజరాత్‌కు 40 రోజుల్లో ఈ షిప్‌మెంట్ చేరినట్లు తెలిపింది. కొరబోబో ప్రాజెక్ట్‌లో అనుబంధ సంస్థ ఓఎన్‌జీసీ విదేశ్ ద్వారా 11% వాటాను కలిగి ఉంది. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో షేరు 1% నష్టంతో రూ. 402 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement