
సాక్షి, న్యూఢిల్లీ : ట్రంప్ యంత్రాంగం చేపట్టిన హెచ్1బీ వీసాల కుదింపుతో దిక్కుతోచని భారత ప్రొఫెషనల్స్‌కు మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఊరడింపు వ్యాఖ్యలు చేశారు. ప్రతిపాదిత బిల్లుతో 5 లక్షల నుంచి 7లక్షల50వేల మంది హెచ్1బీ వీసా హోల్డర్లు భారత్‌కు తిరుగుముఖం పట్టాల్సిన క్రమంలో వారికి స్వాంతన చేకూర్చేలా ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. హెచ్1బీ వీసా కలిగిన భారతీయులను తిప్పిపంపితే వారిని తాము స్వాగతిస్తామన్నారు.
‘మీరు భారత్‌కు తిరిగివస్తే స్వాగతం చెబుతాం...భారత్ ఎదుగుతున్న వేళ మీరు తిరిగిరావడం ఆహ్వానించదగిన పరిణామ’మని మహీంద్రా ట్వీట్ చేశారు. అమెరికన్లకు ఉపాధి అవకాశాలను పెంచేందుకు, స్ధానికలకే ఉపాధి దక్కేలా హెచ్1బీ వీసాలను నియంత్రించే బిల్లును రూపొందించారు. ఈ వీసాలకు సంబంధించి కనీస వేతనం, నైపుణ్య తరలింపులపై పలు ఆంక్షలు విధించారు.