ప్యానాసోనిక్ కొత్త టఫ్‌ప్యాడ్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ కంపెనీ ప్యానాసోనిక్ టఫ్‌ప్యాడ్ విభాగంలో మరో 3 మోడళ్లను హైదరాబాద్ వేదికగా భారత మార్కె ట్లో మంగళవారం ప్రవేశపెట్టింది. వీటిలో రెండు 4.7 అంగుళాల మోడళ్లు కాగా, మరొకటి 10.1 అంగుళాల ట్యాబ్లెట్. ధర రూ.99,000 నుంచి ప్రారంభమై రూ.1.2 లక్షల వరకు ఉంది. అన్ని మోడళ్లు కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా డిజైన్ చేసి ఇస్తారు. అన్ని కఠిన వాతావరణ పరిస్థితులకు తట్టుకునే ఈ ఉపకరణాలు రవాణా, తయారీ, వాహన, రిటైల్, ఆరోగ్య సేవల రంగాలకు ఉపయుక్తమైనవని కంపెనీ తెలిపింది.
టఫ్‌ప్యాడ్ విభాగంలో 12 మోడళ్ల దాకా అందుబాటులోకి తెచ్చామని కంపెనీ సిస్టమ్, సొల్యూషన్ బిజినెస్ అసోసియేట్ డైరెక్టర్ విజయ్ వాధ్వాన్ తెలిపారు. జపాన్, తైవాన్ ప్లాంట్ల నుంచి భారత్‌కు దిగుమతి చేస్తున్నామన్నారు. 2016లో భారత్‌లో 10,000 యూనిట్లను విక్రయించామని టఫ్‌బుక్, టఫ్‌ప్యాడ్ విభాగం నేషనల్ బిజినెస్ హెడ్ గుంజన్ సచ్‌దేవ్ చెప్పారు. దేశీయంగా రగ్గ్‌డ్ ఎలక్ట్రానిక్ ఉపకరణాల మార్కెట్ నాలుగేళ్లుగా 20% వృద్ధి చెందుతోందని, విలువ రూ.125 కోట్లుందని వివరించారు. యూపీ, బెంగళూరు పోలీసు శాఖ టఫ్‌ప్యాడ్స్‌ను వినియోగిస్తున్నాయని తెలిపారు.