ఈపీఎఫ్ పై పన్ను.. కొందరికే భారం!
♦ పన్ను ప్రతిపాదనలపై కేంద్రం వివరణ
♦ తీవ్ర విమర్శలు రావటంతో దిద్దుబాటు చర్యలు
♦ నిర్ణయంపై పునరాలోచిస్తామన్న రెవెన్యూ కార్యదర్శి
♦ పీపీఎఫ్ విత్‌డ్రాయల్స్‌పై పన్నుండదని స్పష్టీకరణ
♦ 2016 ఏప్రిల్ 1 నుంచీ... అదికూడా ఈపీఎఫ్ వడ్డీపైనే పన్ను!
న్యూఢిల్లీ: అన్ని వైపుల నుంచీ విమర్శలు వెల్లువెత్తడంతో ఈపీఎఫ్ విత్‌డ్రాయల్స్‌పై పన్ను విధించాలన్న నిర్ణయంపై పునరాలోచన చేస్తామని కేంద్రం ప్రకటించింది. ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) నిధి నుంచి వెనక్కి తీసుకునే మొత్తంలో 40 శాతానికి పన్ను మినహాయించి మిగిలిన 60 శాతంపై పన్ను విధించాలని బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదనపై ఉద్యోగ, కార్మిక సంఘాల నుంచి తీవ్ర విమర్శలు చెలరేగడంతో కేంద్రం దిద్దుబాటు చర్యలకు దిగింది. ‘‘ఈపీఎఫ్ విత్‌డ్రాయల్స్‌పై విధించనున్న పన్నుపై ఉద్యోగులు ఆందోళన చెందనవసరం లేదు’’ అని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అదియా పేర్కొన్నారు. వచ్చే ఏప్రిల్ నుంచి ఈపీఎఫ్ నుంచి వెనక్కి తీసుకునే 40 శాతంపై పన్ను భారం ఉండదని, మిగిలిన 60 శాతం మొత్తాన్ని పెన్షన్ అందించే యాన్యుటీ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తే ఎటువంటి పన్ను భారం ఉండదని చెప్పారు.
‘‘ఒకవేళ ఈ 60% కూడా వెనక్కి తీసుకుంటే... దీన్లో చందాదారులు తమ వాటాగా చెల్లించిన మొత్తంపై పన్ను ఉండదు. వడ్డీగా వచ్చిన రాబడిపై మాత్రమే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మరో విషయమేంటంటే 2016, ఏప్రిల్ 1 తరవాత ఈ ఖాతాకు జమ అయిన వడ్డీపైనే పన్ను భారం లెక్కిస్తారు’’ అని వివరించారు. అలాగే 15 ఏళ్ల పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) విత్‌డ్రాయల్స్‌పై ఎలాంటి పన్ను భారం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈపీఎఫ్ విత్‌డ్రాయల్స్‌పై విధించిన ఈ నిబంధనలు రూ.15,000 లోపు జీతం ఉన్న వారికి వర్తించవని, ఇందువల్ల చిన్న ఉద్యోగులు ఆందోళన చెందనవసరం లేదని వివరించారు.
ఈపీఎఫ్‌లో మొత్తం 3.7 కోట్ల మంది సభ్యులుంటే అందులో 3 కోట్ల మందికి ఈ నిబంధన పరిధిలోకి రారని ఆయన స్పష్టం చేశారు. కేవలం అధిక జీతం ఉన్న 70 లక్షల మంది నగదు వెనక్కి తీసుకుంటే మాత్రమే ఈ పన్ను భారం ఏర్పడుతుందన్నారు. పదవీ విరమణ తర్వాత ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించడమనేది ఈఎఫ్‌ఎఫ్ స్కీం ప్రధానోద్దేశమని, అందులో భాగంగా పెన్షన్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెం ట్‌ను ప్రోత్సహించేలా ఈ నిబంధనను ప్రవేశపెట్టారని ఆయన వివరించారు.
చిన్న ఫండ్ ఏజెంట్లకు సేవా పన్ను ఊరట
న్యూఢిల్లీ: చిన్న మ్యూచువల్ ఫండ్‌ల పంపిణీదారులకు ఊరటనిచ్చేలా ఏటా రూ.10 లక్షల కన్నా తక్కువ కమీషన్లు అందుకునే ఏజెంట్లకు సేవా పన్ను నుంచి కేంద్రం మినహాయింపునిచ్చింది. అయితే, నిర్దిష్ట పరిమితికి మించి ఆర్జన ఉండే వారు మాత్రం 14 శాతం మేర సర్వీస్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్‌ను ఆకర్షణీయంగా మార్చి, వాటి వైపు మరింత మందిని మళ్లించే దిశగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.