
వరద బాధితుల సహాయార్థం కేరళకు పంపించే వివిధ రకాల వస్తువులపై ప్రాథమిక సరుకుల పన్ను(బీసీడీ), సమీకృత వస్తు, సేవల పన్ను (ఐజీఎస్టీ) నుంచి మినహాయిస్తున్నట్లు..
సాక్షి, న్యూఢిల్లీ : వరద బీభత్సం వల్ల భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లిన నేపథ్యంలో కేరళ వరదలను తీవ్రమైన ప్రకృతి విపత్తుగా పరిగణిస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు మరిన్నినిధులు విడుదల చేసే అవకాశం ఉంది. కాగా వరద బాధితుల సహాయార్థం కేరళకు పంపించే వివిధ రకాల వస్తువులపై ప్రాథమిక సరుకుల పన్ను(బీసీడీ), సమీకృత వస్తు, సేవల పన్ను (ఐజీఎస్టీ) నుంచి మినహాయిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. డిసెంబరు 31, 2018 వరకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని తెలిపింది.
ఈ విషయాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ట్విటర్ ద్వారా తెలిపారు. ఈ మేరకు.. ‘కేరళకు భారత్ మొత్తం అండగా నిలుస్తుంది. కేరళ వరద బాధితుల కోసం పంపించే, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే సరుకులపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, ఐజీఎస్టీ నుంచి కేంద్ర ప్రభుత్వం మినహాయింపునిచ్చిందని’ ఆయన ట్వీట్ చేశారు.
India stands with Kerala in this hour of need. Central Government is exempting basic customs duty and IGST for the consignments of aid and relief materials being despatched or imported from abroad for the affected people.
— Piyush Goyal (@PiyushGoyal) August 20, 2018
పన్ను మినహాయింపు ప్రయోజనాలు పొందాలంటే..
కేంద్ర ప్రభుత్వ, లేదా కేరళ రాష్ట్ర ప్రభుత్వాలచే ఆమోదం పొందిన రిలీఫ్ ఏజెన్సీలకే ప్రస్తుత మినహాయింపు వర్తిస్తుందని ఆర్థిక శాఖ పేర్కొంది. అలాగే మినహాయింపు పొందాలనుకున్న వ్యక్తి లేదా సంస్థ... దానం చేయాలనుకున్న వస్తువుల జాబితాతో పాటుగా.. క్లియరెన్స్‌కు సంబంధించిన సర్టిఫికెట్లను కూడా జత చేయాల్సి ఉంటుంది. అదే విధంగా కేరళలో ఏ జిల్లా, గ్రామానికైతే సాయం చేశారో సంబంధిత జిల్లా మెజిస్ట్రేట్ నుంచి... వస్తువులు స్వీకరించినట్లుగా సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికెట్‌ను డిప్యూటీ కమిషనర్ లేదా కస్టమ్స్ అసిస్టెంట్ కమిషనర్‌కు సమర్పించినట్లయితే ఆరు నెలలోగా ఎప్పుడైనా పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది.